తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నేటికి అంటే శుక్రవారం నాటికి 28 రోజులు అవుతుంది.. తెలంగాణలో 48వేల మంది కార్మికులు 28 రోజులుగా తమ 26 డిమాండ్ల సాధన కోసం సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇన్ని రోజుల పాటు సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి. ఇక 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. సకల జనుల సమ్మెలో భాగంగా అప్పుడు 27 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. ఉమ్మడి ఏపీలోనే 2001లో ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు 24 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడి హయాంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల పెంపు కోసం భారీ స్థాయిలో సమ్మె కొనసాగింది.


ఇక ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఆర్టీసీని నడిపించడం అసాధ్యమని, విలీనం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 17 మందికిపైగా ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా. మరికొందరు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ దశలో ప్రతి ఆర్టీసీ కార్మికుడి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒకవేళ కేసీయార్ కనుక ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే ఇక తాము ఎలా బ్రతకాలి అనే భయం ప్రతికార్మికుని మదిలో మెదులుతుంది. ఈ భయమే వారి మరణాలకు మూలకారణంగా మారింది.


అదీగాక ఇప్పటివరకు కార్మికులకు జీతాలు అందలేదు. అదేమని ప్రశ్నిస్తే సంస్థ ఖాతాలో కేవలం రూ.7 కోట్లు మాత్రమే నిధులు ఉన్నాయని, జీతాలు చెల్లించాలంటే రూ.200 కోట్ల నిధులు అవసరం అవుతాయని సంస్ధ తరఫున న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. మరోవైపు సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు రూ.644 కోట్లు చెల్లించేశారని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుల లెక్కలు చెబుతున్నారని ఆక్షేపించింది. మరోసారి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.


ఇలా ఎటుతెగకుండా సాగుతున్న సమ్మెవల్ల రోజులు గడచి కుంటుంబపొషణ భారంగా మారుతున్న తరుణంలో పలువురు కార్మికులు ఆందోళన చెందుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా  మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లిలో డ్రైవర్ మహ్మద్ ఖాజా (37) బలవన్మరణానికి యత్నించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: