తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త  ఛీప్ ఎవరన్న చర్చ మొదలైంది. ఎవరికి ఇస్తారు...? ఎవరు ఆశిస్తున్నారు అనేది మళ్లీ తెరమీదకు వచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికే పట్టం కడతారా..? లేదంటే సమీకరణాలు మార్చుతారా..? అనేది తేలాల్సి ఉంది. కొత్త సారథి వస్తే అయినా తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందా..?


తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అధిష్టానం పదవిని పొడగిస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాతే.. ఉత్తమ్ ని తప్పిస్తారని భావించారు. కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావటంతో.. ఆయన్ని కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే...పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలే వచ్చాయి. అటు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ రాజీనామాతో కొన్నాళ్లపాటు కాంగ్రెస్ కు అధ్యక్షుడే లేకుండా పోయారు. సోనియాకి బాధ్యతలు వచ్చాక.. పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టారు. ఈలోగా హుజూర్ నగర్ ఉపఎన్నికలు రావడంతో.. ఉత్తమ్ ను కొనసాగించారు. అయితే పద్మావతి ఓటమితో.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ నిర్ణయించుకున్నారు. 


ఇప్పటికే సోనియాగాంధీకి, కోర్ కమిటీకి హుజూర్ నగర్ ఓటమి బాధ్యత తనదేనని ఉత్తమ్ చెప్పేశారు. పీసీసీగా కొనసాగడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ప్రకృతి వైద్యం కోసం కర్ణాటక వెళ్లిన ఉత్తమ్.. పది రోజులు అక్కడే ఉంటారు. ఇప్పుడు కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే చర్చ మొదలైంది. పీసీసీ చీఫ్ రేసులో....సామాజికవర్గాల వారీగా పోటీ పడుతున్నారు నాయకులు. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే పార్టీ పగ్గాలు ఇస్తేనే కొంత జోష్ ఉంటుందనే లెక్కలేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి ఈ ఒక్కసారైనా అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సంపత్ లు. ఈ రెండు సామాజికవర్గాలకు కాకుండా మరొకరికి అవకాశం ఇస్తే అలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 


రెడ్డి సామాజికవర్గం నుంచి...రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కోమటిరెడ్డికి కొంత ఇబ్బంది కలిగిందనే ప్రచారం మాత్రం ఉంది. ఇక రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ఆయన వర్గం జోష్ లో ఉంది. ఐతే పార్టీలో సీనియర్ నాయకులు అంతా.. రేవంత్ ని వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి మరో ఎత్తుగడను వేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. తనకు పీసీసీ దక్కకపోయినా... సీనియర్ నాయకుడు జానారెడ్డికి పదవి ఇచ్చినా ఇబ్బంది లేదనే ఆలోచనను పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. జానారెడ్డి... రేవంత్ ల మద్య సత్సంబంధాలే ఉన్న తరుణంలో.. జానారెడ్డికి పదవి దక్కినా ఇబ్బంది లేదనే ఆలోచనలో రేవంత్ ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఎన్నికల నాటికైనా తనదే పీసీసీ అనే అంచనాల్లో రేవంత్ ఉన్నట్టు సమాచారం. రేవంత్ ను వ్యతిరేకించే వర్గం జీవన్ రెడ్డి పేరును కూడా ప్రతిసాదిస్తున్నట్టు సమాచారం. ఐతే వీరితో పాటు... మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. 


కాంగ్రెస్ కుటుంబమై ఉండి.. విధేయత ఉన్నవారికే పీసీసీ ఇవ్వాలనే వాదనను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వినిపిస్తున్నారు. ఈ కేటగిరీలో శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పేర్లున్నాయి.  పార్టీనిర్మాణం కోసం కొంత లౌక్యం ఉన్న నాయకుడికి పార్టీ పగ్గాలు ఇచ్చి... ఎన్నికల నాటికి మళ్లీ కొత్త నాయకత్వాన్ని తెరమీదకు తేవచ్చనే ఆలోచన ఏఐసీసీకి ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: