అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సీఎం దగ్గర నుంచి మంత్రులు పలుమార్లు వార్నింగ్ అందుకున్న విషయం తెలిసిందే. ఒక వైపు సీఎం జగన్ తొలిసారి పదవి చేపట్టిన కష్టపడుతూ ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తున్నారు. కానీ మంత్రులు మాత్రం సీఎం కష్టానికి తగిన ప్రతిఫలం లేకుండా చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ కొందరు మంత్రుల పని తీరుపై పలుసార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు.


గత మూడు పర్యాయాలు జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో జగన్ ఏదొక విషయం మీద మంత్రులని హెచ్చరిస్తూనే ఉన్నారు. పనితీరు, అవినీతి ఆరోపణలు, సచివాలయంలో అందుబాటులో లేకపోవడం ఇలా పలు అంశాలపై జగన్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే వారిలో పెద్ద మార్పు వచ్చినట్లు కనబడటం లేదు. అందుకే జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు జగన్...రెండున్నర ఏళ్ళు కొనసాగిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.


ఆ తర్వాత పనితీరు బట్టి కొందరిని మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ జగన్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనబడుతుంది. ఆరు నెలల్లోనే పనితీరు సరిగా లేని వారిని తప్పించడం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఐదు నెలలు మంత్రుల పని తీరు పరిశీలించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ మంత్రులకు టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే మరో నెలలోనే కొందరిని ఏరివేసే అవకాశముంది.


తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. ఇప్పటికైనా సమర్ధత నిరూపించుకోకపోతే ఇప్పుడున్న మంత్రుల్లో 25 శాతం మందిని మరో ఆరు నెలల్లోనే పక్కకు తప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. అలాగే ఈ సందర్భంగా జగన్ మంత్రులకు పలు సూచనలు చేసినట్లు తెల్సింది. ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ, పార్టీ బలోపేతం , ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సఖ్యత లాంటి అంశాలు మంత్రుల బాధ్యతేనని చెప్పారు.


అలాగే ఇన్ చార్జ్ మంత్రులతో పాటు, మంత్రులు వారానికి కనీసం 2 రోజులు తమకు కేటాయించిన జిల్లాల్లో ఉండాలని ఆదేశించారు. ఎందుకంటే కొందరు మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లడం లేదని తెలిసింది. ఇక ఇవన్నీ చూసుకుంటూనే తమ శాఖకు సంబంధించిన పనుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్ని చెప్పిన మారకపోతే ఆరు నెలల్లో వారికి ఊస్టింగ్ తప్పదని జగన్ గట్టిగానే హెచ్చరించినట్లు తెలిసింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: