అదేదో సినిమాలో అవ్వాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని ఓ క్యారెక్టర్ తో చెప్పిస్తారు. సినిమాలో ఆ డైలాగ్  కామెడి బిట్ గా బాగానే పేలింది. నిజజీవితంలోకి వస్తే సిఎంగా ఉన్నపుడు చంద్రబాబునాయుడు కూడా అలాగే వ్యవహరించారు. పోలవరం ప్రాజెక్టయినా, రాజధాని నిర్మాణమైన ఎన్నిసార్లు శంకుస్ధాపనలు చేశారో లెక్కేలేదు.

 

పోలవరం ప్రాజెక్టును ప్యాకేజీలుగా విడగొట్టి చాలా శంకుస్ధాపనలే చేశారు. అలాగే రాజధాని నిర్మాణం పేరుతో నరేంద్రమోడితో శంకుస్ధాపన చేయించారు. తర్వాత అదేదో సిటి అని, అదేదో పనులని చెప్పి అరుణ్ జైట్లితో ఒకసారి అమిత్ షా తో మరోసారి, నిర్మల సీతారామాన్ ను పిలిపించి మరోసారి ఇలా చాలాసార్లు శంకుస్ధాపనలే చేయించారు.

 

ఇదంతా ఎందుకంటే శుక్రవారం మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. నిజానికి కాంట్రాక్టు చేతికొచ్చిన తర్వాత ఈ కంపెనీ పనులు మొదలుపెట్టింది ఇపుడే.  ఆ సందర్భంగా కంపెనీ భారీ ఎత్తున పూజలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పూజల దగ్గర జగన్ కానీ మంత్రులు కానీ ఎక్కడా కనబడలేదు.

 

అదే చంద్రబాబు హయాంలో అయితే రచ్చ రచ్చే జరిగుండేదనటంలో సందేహం లేదు. మంది మార్బలాన్ని వెంటేసుకుని ఎంఎల్ఏలు, ఎంపిలు, పార్టీ నేతలు పూజలు జరిగే ప్రాంతంలో వాలిపోయుండేవారే. ఆ సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేసుండేవారు. దీనికి మళ్ళీ కోట్ల రూపాయల ఖర్చు అయ్యేది.

 

మరి జగన్ మాత్రం పూజా కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదు ? ఎందుకు హాజరుకాలేదంటే అవసరం లేదనుకున్నారు కాబట్టి. కాంట్రాక్టు సంస్ధ పనులు మొదలుపెట్టటమంటే అది కంపెనీకి సంబంధించిన విషయం. పనులు మొదలుపెట్టి సకాలంలో నాణ్యతా లోపాలు లేకుండా పూర్తి చేయటం కంపెనీ బాధ్యత. అంతే కానీ తన గొప్పతనాన్నో లేకపోతే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటానికి వేదిక కాకూడదని జగన్ అనుకున్నారు. అందుకనే తాను హాజరుకాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: