రాజ‌కీయాల్లో నాయ‌కులు అనుస‌రించే వ్యూహాల‌ను ఇత‌మిత్థంగా ఇదీ అని చెప్ప‌డం చాలా క‌ష్టం. వారికి అవ‌స‌ర‌మైన విధంగా అప్ప‌టి ప‌రిస్థితుల‌ను మార్చుకోవ‌డంలో నాయ‌కులు ఆరితేరిపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ టీడీపీ నేత‌, సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ కూడా వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు శిష్యుడిగా గుర్తింపు పొందిన డొక్కా.. కాంగ్రెస్‌లో ఉండ‌గా తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించి ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌విని కూడా ద‌క్కించుకున్నారు.


రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్‌కు రాం రాం చెప్పి.. వైసీపీలోకి చేరాల‌ని అనుకున్నారు. అయితే, రాయ‌పాటి పిలుపుతో ఆయ‌న త‌న గురువు వెంట న‌డిచి టీడీపీ తీర్తం పుచ్చుకున్నారు. అదేస‌మ‌యంలో ఎమ్మెల్సీగా కూడా ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న అభీష్టానికి వ్య‌తిరేకంగా పార్టీ అధినేత చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. త‌న‌కు ఎంతో కాలంగా క‌లిసి వ‌చ్చిన‌, త‌న ప‌ట్టున్న తాడికొండ‌ను కాద‌ని ప్ర‌త్తిపాడును కేటాయించ‌డం, త‌న‌కు వ్య‌తిరేకంగా గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ ప్ర‌చారం చేయ‌డంతో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.


త‌న‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గంలోనే టికెట్ కేటాయించాల‌ని కోరినా.. ఆ ప‌రిస్థితి లేకపోవ‌డంతో డొక్కా మాన‌సికంగా ఇబ్బంది ప‌డ్డారు.ఈ  క్ర‌మంలోనే ఇక‌, టీడీపీలో ఉండ‌డం అన‌వ‌స‌ర‌మ‌ని ఆయ‌న నిర్ణ‌యా నికి వ‌చ్చారు. పైగా వైసీపీ నుంచి ఆయ‌న‌కు ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీని మారిపోవాల‌ని అనుకున్నారు. అయితే, బాబు ఆయ‌న‌ను బుజ్జ‌గిస్తూ.. వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా త‌న‌కు తాడికొండ‌ను కేటాయించే అవ‌కాశం లేక‌పోవ‌డం, ప్ర‌త్తిపాడు నాన్ లోక‌ల్ కావ‌డ‌దంతో డొక్కా.. వైసీపీలోకి వెళ్లిపోవ‌డ‌మే బెట‌ర‌ని అనుకున్నారు.


ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీడీపీలో త‌న‌కు త‌నే పొగ‌బెట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇక్క‌డ ఇటీవ‌ల ఎన్ని క‌ల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌పై త‌న అనుచ‌రుల‌తో తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేయిస్తున్నారు. ఈ ప‌రిస్థితిని శ్రావ‌ణ్ కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ఆయ‌న కూడా డొక్కాపై వ్య‌తిరేక ప్ర‌చారం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యం సీరియ‌స్ అవుతుంద‌ని, బాబు త‌న‌పై చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు వెళ్తుంద‌ని, దీనిని అడ్డు పెట్టుకుని పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌చ్చ‌ని, త‌ప్పును పార్టీ పైకి నెట్టేయొచ్చ‌నే వ్యూహంలో డొక్కా పుల్ల‌లు పెడుతూ ఉన్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: