రాష్ట్రంలో ఓ విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన‌.. జీవో.. 2430పై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గాల్సిన స్థానంలో ర‌చ్చ జ‌రుగుతోంది. ఈ జీవోపై మేధావులు మౌనంగా ఉంటే.. కొంద‌రు మాత్రం రోడ్డెక్కారు. ఇక‌, రాజ‌కీయ నేత‌ల ప‌రిస్థితి చెప్ప‌నే అక్క‌ర్లేదు. ఇంత‌కీ ఈ జీవో ఏంటి? అంటే.. ప్ర‌భుత్వంపైనా, ప్ర‌భుత్వ శాఖ‌ల‌పైనా.. కొంద‌రు నాయ‌కుల‌పైనా మీడియాలో వ‌చ్చే నిరాధార ఆరోప‌ణ‌లు, క‌థ‌నాల‌కు ముక్కుతాడు వేస్తూ.. జ‌గ‌న్ స‌ర్కారు 2430 తీసుకువ‌చ్చింది.


వాస్త‌వానికి ప్ర‌జాస్వామ్య మూల‌స్తంభాలైన పాల‌న‌, న్యాయ‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు జ‌ర్న‌లిజం కూడా కీల‌క అంగం. అంతేకాదు, ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధిగా ఉన్న‌ది కూడా ఈ రంగ‌మే. ప్ర‌భుత్వానికి ముక్కు చెవులు, క‌ళ్లు అన‌ద‌గిన రీతిలో జ‌ర్న‌లిజం ఉండాల‌ని అభిల‌షించేవారు ఎంద‌రో ఉన్నారు. అయితే, రాను రాను ఈ జ‌ర్న‌లిజం రాజ‌కీయ రంగు పులుముకుంది. దీంతో త‌మ‌కు న‌చ్చ‌ని నాయ‌కులు, త‌మకు న‌చ్చ‌ని పార్టీల‌పై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం, లేనిపోని అభూత క‌ల్ప‌న‌ల‌తో క‌థ‌నాల‌ను వండి వార్చ‌డం మామూలు విష‌యంగా మారిపోయింది.


ఈ నేప‌థ్యంలోనే దేశ‌వ్యాప్తంగా మీడియా బాధిత ప్ర‌భుత్వాలు అనేక సార్లు మీడియాను క‌ట్ట‌డి చేసేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి జీవోలు తెచ్చిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇలానే వైఎస్ హ‌యాంలో కూడా 938 జీవో తో త‌న ప్ర‌భుత్వంపై మీడియా చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, దీనిని ఆయ‌న త‌ర్వాత కాలంలో ఉప‌సంహ‌రించుకున్నారు. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ మ‌ళ్లీ ఈ జీవోను బ‌య‌ట‌కు తీసి .. కొత్తగా అమ‌లు చేసేందుకు అధికారుల‌కు అధికారం ఇచ్చారు.


ఇప్పుడు ఈ విష‌యంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున విప‌క్షాలు క‌న్నీరు కారుస్తున్నాయి. నిజ‌మే! ప్ర‌జాస్వామ్యం లో ప‌త్రిక‌ల‌ను, మీడియాను క‌ట్ట‌డిచేయ‌డాన్ని ఎవ‌రూ స‌హించ‌రు. అయితే, అదేస‌మయంలో ఇప్పుడు మొస‌లి క‌న్నీరు కారుస్తున్న నాయ‌కులు గ‌డిచిన ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు అప్ర‌క‌టిత నిర్బంధాన్ని జ‌గ‌న్ మీడియా సంస్థ‌ల‌పై విధించిన‌ప్పుడు ఏం చేశారు?  రాజ‌ధాని భూముల విష‌యంలో రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ.. అనేక క‌థ‌నాలు సాక్షిలో వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టి డీజీపీ రాముడును ఉసిగొల్పి.. జ‌ర్న‌లిస్టుల‌ను అర్ధ‌రాత్రి వేళ పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లించి విచార‌ణ పేరుతో ఇబ్బంది పెట్టి, భ‌య భ్రాంతుల‌కు గురిచేసిన‌ట్టు ఇప్పుడు లేచిన గ‌ళాలు ఏం చేశాయి?


 అంతేకాదు, రైతు రుణ మాఫీపై మీడియాలో క‌థ‌నాలు రావ‌డానికి వీల్లేద‌ని, అధికారులు సాక్షి ప‌త్రిక ప్ర‌తినిధుల‌తో మాట్లాడ‌రాద‌ని 2016లో చంద్ర‌బాబు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన‌ప్పుడు.. జ‌గ‌న్ మీడియా స‌హా త‌న‌కు వ్య‌తిరేకంగా ఉంద‌నే అక్క‌సుతో ప్ర‌జాశ‌క్తి ప‌త్రిక‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఈ గ‌ళాలు మౌనం వ‌హించాయి. నాడు.. చంద్ర‌బాబు కూడా త‌న ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక వార్త‌లు రాసేవారిని మౌఖిక ఆదేశాల‌తో దొడ్డిదారిన క‌ట్ట‌డి చేయ‌డాన్ని ఇప్పుడు జీవో ద్వారా జ‌గ‌న్ మీడియాపై ఉక్కు పాదం మోపుతామ‌న‌డాన్ని ఒకే తీరులో చూడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అంతే త‌ప్ప‌.. బాబుగారు  చేసిన‌ప్పుడు.. మౌనం వ‌హించి, ఇప్పుడు బాధ‌ప‌డ‌డంలో అర్ధం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: