కొడాలి నాని..జగన్ కేబినెట్ లో మంత్రి.. అయినా ఆయన మాస్ లీడర్ గానే ఉంటారు. ఏదైనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2340పై టీడీపీ అనుకూల పత్రికలు మీడియాకు సంకెళ్లు .. కలానికి సంకెళ్లు అంటూ విరుచుకుపడటంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430 కలానికి సంకెళ్లు వేయదన్నారు.


అది కలానికి సంకెళ్లు కాదని.. తప్పుడు వార్తలు రాసే కులానికి సంకెళ్లు పడుతాయని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. పిచ్చి రాతలు మాని..వాస్తవాలు రాయాలని హితవు పలికారు. ఇదే సమయంలో చంద్రబాబు తీరుపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఎంత సేపూ నా కులమే పాలించాలి.. నా కులం వాళ్లకే మేలు జరగాలనే చంద్రబాబు తీరు ఏమాత్రం మంచిది కాదన్నారు కొడాలి నాని.


ఇదే అంశంపై మరో మంత్రి పేర్ని నాని స్పందించారు. పత్రికలకు, టీవీ చానళ్లకు కేంద్రం మాత్రమే అనుమతులు ఇవ్వగలుగుతుందని ఆయన అన్నారు. కాని కొన్ని పత్రికలు కలానికి సంకెళ్లు అంటూ అందమైన హెడింగ్ లు ఇచ్చి ప్రజలను తప్పు దారి పట్టించే యత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. గత నెల ముప్పైన ఇచ్చిన జిఓ ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలు, లేదా కార్యక్రమాలకు సంబందించి కాని వాస్తవాలకు విరుద్దంగా, రాజకీయ పార్టీల ప్రేరణతో ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేసే ప్రయత్నం జరిగితే, సంబందిత శాఖలు ఖండించాలని, దానిని సంబందిత మీడియా ప్రజలకు తెలియచేయవలసి ఉంటుందని ఆయన అన్నారు.


అందుకు కూడా మీడియా సిద్దపడకపోతే ... అవాస్తవాలు ప్రచురంచి ఉంటే గత్యంతరం లేని స్థితిలో ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు ప్రకారం లీగల్ నోటీసు ఇచ్చి పరువు నష్టం పై సంజాయిసీ కోరాలని, లేని పక్షంలో కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.ఇందులో తప్పేముందని, సంకెళ్లు వేసింది ఎక్కడ అని నాని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: