వివాహం విషయంలో మన దేశంలో ఇప్పటికీ కులం అత్యంత ప్రభావం చూపుతోంద‌ని కొద్దికాలం కింద‌ట‌ ఓ సర్వే వెల్లడించింది. చదువుకున్నోళ్లు, ఉన్నత ఉద్యోగాలు చేసేవారు కులాంతర వివాహాలకు అభ్యంతరం చెప్పరని అందరూ ఊహిస్తున్నారని...కానీ దానికి భిన్నంగా విద్యావంతుల్లోనే కులాల పట్టింపులు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. ఈ స‌ర్వేలోని  అంశాల‌ను అలా ప‌క్క‌నపెడితే...కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఎస్సీ అభివృద్ధిశాఖ ద్వారా అందజేస్తున్న ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రోత్సాహకం కింద ఇప్పటివరకు రూ.50 వేలు అందిస్తుండగా, ఇకపై ఆ మొత్తాన్ని
రూ.2.50 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు జారీచేశారు. 


కులాంత‌ర వివాహాలను ప్రోత్సహించడంతో పాటు అలా పెళ్లి చేసుకున్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆర్థిక సాయాన్ని పెంచుతూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. ఎస్సీయేతర కులాలవారిని పెళ్లి చేసుకున్న ఎస్సీ యువకుడు లేదా యువతికి ఈ పథకం వర్తిస్తుంది. మంజూరైన సాయాన్ని పెళ్లయిన జంటల పేరిట మూడేళ్లకు ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. ఆ తర్వాతే వారు డబ్బులు డ్రా చేసుకునే చాన్స్ ఉంటుంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఐదేండ్లలో 4,658 జంటలకు ఎస్సీ అభివృద్ధిశాఖ ద్వారా రూ.23.06 కోట్లు అందించారు.


ఇదిలాఉండ‌గా, ఆర్థిక గణాంక శాఖ నేతృత్వంలో నడుస్తున్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)కు చెందిన ముగ్గురు పరిశోధక విద్యార్థులు త్రిదిప్ రాయ్, ఆర్క రాయ్ చౌదరి, కోమల్ సాహి గ‌త ఏడాది నిర్వహించిన సర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. అనాలసిస్ ఆఫ్ ఇంటర్-క్యాస్ట్ మ్యారేజెస్ ఇన్ ఇండియా పేరుతో తమ పరిశోధనాపత్రాన్ని సమర్పించారు. 2011లో జరిగిన వివాహాల్లో 36 శాతం కులాంతర వివాహాలు ఉన్నట్టు తెలిపారు. అగ్రవర్ణాల్లో కులాంత వివాహాల సంఖ్య అధికంగా ఉందని, ముఖ్యంగా బ్రాహ్మణుల్లో కులాంతర పెండ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండోస్థానంలో ఓబీసీలు ఆ తర్వాత స్థానంలో ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని వెల్లడించారు. అగ్రవర్ణాల్లో ఉప కులాలు ఉన్నాయని.. ఉప కులాల మధ్య వివాహాలను సైతం పరిగణనలోకి తీసుకోవడంతో వారు మొదటిస్థానంలో నిలిచారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: