జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ధాయేంటో తెలంగాణా ప్రభుత్వం తేల్చేసిందా ? జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తగుదునమ్మా అంటూ పవన్ వేలు పెట్టబోయారు. తీరా వేలు పెట్టక ముందే  కాలిపోయే పరిస్ధితి ఎదురయ్యేసరికి  ఇపుడు తీరిగ్గా మందు రాసుకుంటున్నారు.

 

ఇంతకీ జరిగిందేమిటంటే గడచిన 30 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డిమాండ్ల విషయంలో, చర్చల విషయంలో ఇటు కెసియార్ అటు ఆర్టీసీ కార్మిక నేతలు ఎవరికి వారుగా పట్టుదలకు పోవటంతో సమ్మె అనివార్యమైపోయింది. దాంతో కోట్లాదిమంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో స్వయంగా కోర్టు జోక్యం చేసుకున్నా కెసియార్ వెనక్కు తగ్గటం లేదు.

 

సమ్మె ఎంత ఉధృతం అవుతున్నా కెసియార్ మాత్రం లక్ష్యం చేయటం లేదు. ఈ నేపధ్యంలోనే కెసియార్ తో మాట్లాడి ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలుకుతానంటూ పవన్ బయలుదేరారు. సమ్మె విషయంలో మద్దతు కోసం కార్మిక నేతలు పవన్ ను కలిసినపుడు కెసియార్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. తర్వాత కెసియార్ ను కలవాలంటే ఎలా సాధ్యమని ఆలోచించలేదు.

 

శుక్రవారం కెసియార్ అపాయిట్మెంట్ కోసం పవన్ ప్రయత్నిస్తే సాధ్యాం కాదని తేల్చి చెప్పేశారట. పోనీ ఆయన కొడుకు, మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ ను అయినా కలుద్దామని అనుకుంటే ఆయనా కాదన్నారట. చివరకు రాజ్యసభ సభ్యుడు కెకెను కలిసి మాట్లాడుదామని ప్రయత్నిస్తే ఆయనసలు అందుబాటులోకే రాలేదని సమాచారం.

 

ఒకసారి కెసియార్ కాదంటే మళ్ళీ కెసియార్ దగ్గర పనిచేసే వాళ్ళెవరైనా తమతో మాట్లాడుతారా ? అన్న కనీస ఇంగితం కూడా పవన్ దగ్గర ఉన్నట్లు లేదు. కోర్టు చెబితేనే వినని కెసియార్ తాను మాట్లాడితే వింటాడని పవన్ ఎలాగ అనుకున్నాడో ఆయనకే తెలియాలి. లేని పెద్దరికాన్ని మీదేసుకోవటానికి ఇక్కడున్నది చంద్రబాబునాయుడు కాదు కెసియార్ అన్న విషయం పవన్ కు ఇంకా గుర్తించినట్లు లేదు. అందుకే తల బొప్పి కట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: