పెళ్లి మంటపం లో కూర్చొని వరుడు చేత తాళి కట్టించుకోవాల్సిన నవవధువు ...  డెంగీ జ్వరం కారణంగా మృత్యువాత పడిన ఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండల పరిధిలోని నరిసింహాపురం పంచాయితీ లోని టివిఎన్నార్ పురం లో చోటు చేసుకుంది . పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుని మండపం లోకి పెళ్లి కూతురు తీసుకురావాల్సి ఉండగా , డెంగీ జ్వరం కారణంగా వధువు మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది . టివిఎన్నార్ పురం కు చెందిన కృష్ణంరాజు , రెడ్డెమ్మ ల కూతురు చంద్రకళ అలియాస్ కావ్య కు అక్టోబర్ 30  న పెళ్లి చేయాలని పెద్దలు  నిర్ణయించారు . అయితే ఇంతలోనే కావ్య కు డెంగీ జ్వరం వచ్చింది .


 చికిత్స నిమిత్తం తమిళనాడులోని షోలింగర్ ప్రభుత్వ ఆసుపత్రికి , అక్కడి నుంచి వేలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . అయితే డెంగీ జ్వరం మాత్రం నయం కాలేదు . ఇంతలోనే పెళ్లి ముహూర్తం రానేవచ్చింది . బుధవారం బంధువులు , మిత్రులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. డెంగీ జ్వరం కారణంగా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న కావ్య ను ఎలాగైనా పెళ్లి మండపానికి తీసుకువచ్చి, వరుడి చేత  తాళి కట్టించాలని బంధు , మిత్రులు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని వైద్యులు అభ్యంతరం చెప్పడం తో బంధు, మిత్రులు  తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు .


 డెంగీ జ్వరం నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి కావ్య తిరిగి వస్తుందని  బంధు , మిత్రులు  భావించారు . కానీ కావ్య చికిత్స పొందుతూనే ఆసుపత్రిలోనే మృతి చెందడం తో పెళ్ళికని వచ్చిన బంధు, మిత్రులు ఆమె అంతిమయాత్ర లో పాల్గొని విషాదవదనాలతో తిరుగుముఖం పట్టారు . పెళ్లి చేసి కూతురిని అత్తవారి ఇంటికి పంపుదామనుకున్న తల్లితండ్రులు కూతుర్ని స్మశానానికి పంపాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు .


మరింత సమాచారం తెలుసుకోండి: