రాష్ట్రంలో ఇసుక కొరత, ప్రభుత్వ విధానాలు, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు.. ఈ సంఘటనల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 3న.. ఆదివారం రోజున విశాఖ మహానగరంలో తమ నిరసన గళం వినిపించేందుకు ‘లాంగ్ మార్చ్’ పేరుతో ఓ భారీ కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. కానీ వారికి అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. జనసేన లాంగ్‌మార్చ్ సభకు అనుమతి నిరాకరిస్తూ ఏర్పాట్లను అడ్డుకున్నారు.

 


విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద జనసేన పార్టీ నేతలు చేస్తున్న ఏర్పాట్లను అధికారులు అడ్డుకున్నారు. మార్చ్ కు, అనంతరం సభకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలను అధికారులు అడ్డుకున్నారు. ఈ మార్చ్ కోసం అధినేత పవన్ ఇచ్చిన పిలుపు అందుకున్న రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు ఈ సభలో పాల్గొనటానికి విశాఖ చేరుకుంటున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి హెచ్చరిక పంపాలన్న పవన్ ఉద్దేశానికి జనసైనికులు సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలో సభకు పర్మిషన్ లేదంటూ అధికారులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఓవైపు ఇసుక సంక్షోభంతో రాష్ట్రంలో నిరసన గళాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలువురు భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పవన్.

 


లాంగ్ మార్చ్ కార్యక్రమానికి టీడీపీ కూడా మద్దతివ్వబోతోంది. ఇప్పటికే బీజేపీ మద్దతు కోరినా అందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. వామపక్షాలు మద్దతిస్తాయని భావించినా బీజేపీని పవన్ ఆహ్వానించారని వారు సభకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభ నిర్వాహణను అడ్డుకోవడం తదితర పరిణామాలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: