మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు వచ్చి వారంరోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడటం లేదు. బీజేపీతో ఏటు తేలకపోవడంతో శివసేన ప్రత్యామ్నాయాల వేటలో పడింది. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో ఉద్ధవ్ థాక్రే ఫోన్‌లో మాట్లాడారు. వీరి సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశముంది. పవార్‌ ఇదే విషయమై చర్చించేందుకు సోనియాను కలవనున్నారు. 


శివసేన, ఎన్సీపీ అగ్రనేతలు ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ ఫోన్ లో మాట్లాడుకోవడం మహరాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. శరద్ పవార్ నివాసంలో ఉన్నప్పుడు ఈ ఫోన్‌ సంభాషణ జరిగింది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్సీపీ, కాంగ్రెస్‌లు శివసేనకు మద్దతు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం పదవి విషయంలో బీజేపీ, శివసేన మధ్య  విభేదాలు తలెత్తడంతో ఈ ఫోన్‌ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. 


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ105, శివసేన 56 స్థానాలు గెల్చుకున్నాయి. రెండు పార్టీల మధ్య సీఎం పదవి విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీనివల్ల ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో శివసేన ప్రత్యామ్నాయలను వెతకడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఎన్సీపీ అధినేత పవార్‌ను కలిశారు శివసేన ఎంపీ. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ బలం 54, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 44 మందితో కలిసి అవసరమైతే శివసేనకు మద్దతిచ్చే అంశంపై ఠాక్రే, పవార్‌ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 


గురువారం రాత్రి వీరి మధ్య చర్చలు జరగ్గా, శుక్రవారం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ బీజేపీకి ఘాటు హెచ్చరిక చేసేలా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు శివసేన కూడగట్టుకోగలదని వ్యాఖ్యానించారు. మరోవైపు  శరద్‌పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసే అవకాశముంది. బీజేపీ ఫిఫ్టీ - ఫిఫ్టీ ఫార్ములాకు అంగీకరించడం లేనందున... ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటువైపు శివసేన మొగ్గుచూపుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: