పది రోజులు.. ఐదు కీలక తీర్పులు. నవంబర్‌ 17న రిటైర్‌ కాబోతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కీలక  షెడ్యూల్‌ ఇది. దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య వివాదం కూడా ఈ ఐదు తీర్పుల్లో ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ కన్నా.. ఈ లోపుగా ఆయన వెలువరించనున్న తీర్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవంబర్‌ 17 జస్టిస్‌ గొగోయ్‌ చివరి వర్కింగ్‌ డే. తర్వాతి రోజు అంటే నవంబరు 18న జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే  ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది రోటీన్‌గా జరిగే ప్రక్రియే. కాకపోతే.. రిటైర్మెంట్‌కు ముందు పలు రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించి.. వాదనలు విన్న జస్టిస్‌ గొగోయ్‌ వచ్చే నెల 17లోపు వాటిపై  తీర్పు చెప్పబోతున్నారు. ఈ పదిహేడు రోజుల్లో చీఫ్‌ జస్టిస్‌గా గొగోయ్‌ వర్కింగ్‌ డేస్‌ పది రోజులు మాత్రమే. ఈ పదిరోజుల్లోనే ఐదు కీలక తీర్పులు చెప్పనున్నారు న్యాయమూర్తి గొగోయ్‌. 


ఈ ఐదు తీర్పుల్లో అత్యంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన అంశం అయోధ్య వివాదం. దాదాపు 40 రోజుల పాటు సీజే నేతృత్వంలోని ధర్మాసనం రోజువారీ వాదనలు నోట్‌ చేసుకుంది. ఇక రెండో కీలక అంశం రాఫెల్‌ యుద్ధ విమాన ఒప్పందం.  శబరిమల అయ్యప్ప ఆలయంలోనికి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించే తీర్పుపై సమీక్ష మూడో జడ్జిమెంట్. చౌకీదార్‌ చోర్‌ హై అని ప్రధాని మోడీని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కోర్టు ధిక్కారణ తీర్పు నాలుగోది. 2017 ఫైనాన్స్‌ యాక్ట్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తీర్పు చెప్పబోతున్నారు. మనీ బిల్‌గా చెబుతూ ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదింప చేశారన్నది  పిటిషన్ల అభియోగం. 


ప్రస్తుతం  సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు నడుస్తున్నాయి. ఈ నెల కోర్టు  4న తిరిగి ప్రారంభమవుతుంది. మధ్యలో నవంబర్‌ 11, 12 తేదీలు సెలవులున్నాయి. అందుకే పదిరోజుల పని దినాల్లో ఐదు కీలక తీర్పులు చెప్పబోతున్నారు జస్టిస్‌ గొగోయ్‌. ఈ తీర్పులు గురించి రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంజన్‌ గొగోయ్ ఈ కేసులపై ఇచ్చే జడ్జిమెంట్‌లు దేశాన్ని ఎంతో ప్రభావితం చేయనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: