జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ మార్చ్‌ను వైసీపీ మంత్రులు తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ... ప‌వ‌న్ మార్చ్‌ను ఖండించారు. ఏపీలో ఇసుక కొరతను రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. ``రాష్ర్టంలో నదులన్నీ పొంగిప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. నదులలో వరదల వల్ల కొంచెం ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక కొరత ఏర్పడటం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లకు సంతోషంగా ఉంది. వైయస్ జగన్‌పై బురద చల్లేందుకు సాకు దొరికిందని ఆనందపడుతున్నారు.`` అని మండిప‌డ్డారు.


వాస్తవాలను తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నారని, విశాఖలో లాంగ్ మార్చ్ దేనికి లాభమ‌ని మంత్రులు ప్ర‌శ్నించారు. చంద్రబాబు డైరక్షన్లోనే ఇంకా పవన్ రాజకీయం చేస్తున్నారని మండిప‌డ్డారు. ``గుంటూరులో లోకేష్ దీక్ష చేస్తే విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తారు. చంద్రబాబు హయాంలో ఇసుకమాఫియా ఆగడాలపై పవన్ ఏనాడు ప్రశ్నించలేదు. ఆనాడు భవన నిర్మాణ కార్మికులు తమ సంక్షేమనిధులను పక్కదారి పట్టించారని ధర్నాలు చేసి చెప్పినా పవన్ కనీసం మధ్దతు ఇవ్వలేదు. క్రెడాయ్ వంటి సంస్దలు విశాఖనుంచి ఇసుకమాఫియా వల్ల నిర్మాణాలలో ఇబ్బంది పడుతున్నారని బహిరంగంగా చెప్పినా ఆనాడు పవన్ చంద్రబాబును ప్రశ్నించలేదు. భవన నిర్మాణ కార్మికుల నిధులను పక్కదారి పట్టించిన విషయం వాస్తవం కాదా?`` అని నిల‌దీశారు. ``లాంగ్ మార్చ్‌కు రావడంలేదని అటు బీజేపీ, ఇటు పవన్‌తో ఇటీవ‌లి ఎన్నికలలో కలసి నడిచిన కామ్రేడ్స్ తేల్చిచెప్పారు. ఇక లాంగ్ మార్చ్‌కు పవన్ కల్యాణ్ ,చంద్రబాబు మాత్రమే మిగిలారు. `` అని తెలిపారు. ఒకే డైరక్టర్ ఒకే నిర్మాత,ఒకే స్ర్కిప్ట్ తో ఐదేళ్లు నడిచింది ప్రస్తుతం కూడా నడుపుతున్నారు అని వ్యాఖ్యానించారు. 


చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక మాఫియా నేపధ్యంలో అధికారంలోకి రాగానే  ఇసుక దోపిడీని అరికట్టేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నూతన పాలసి తీసుకువచ్చారని మంత్రులు స్ప‌ష్టం చేశారు. ``ఇసుక రవాణాలో గాని తవ్వకాలలోగాని మా పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని  కఠిన చర్యలకు ముఖ్యమంత్రి  స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నదులలో వరదలు ఉన్నాకూడా ఇసుకను తవ్వితీసే టెక్నాలజీ ఉంటే చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు మాకు చెప్పండి.`` అని వ్యాఖ్యానించారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: