రాజకీయ నాయకుల పుట్టినరోజు జరిగితే ఎంతోమంది శుభాకాంక్షలు తెలపడం సాధారణంగా జరిగేదే. ఇంకో అడుగు ముందుకేసి అభిమానులు, కార్యకర్తలకు భోజనాలు పెట్టిస్తారు. లేదా.. అభిమానులు, కార్యకర్తలే నాయకుడి ఇంటి దగ్గర ఏ సాంస్కృతిక కార్యక్రమమో ఏర్పాటు చేస్తారు. కానీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే వైసీపీ సత్తి సూర్యనారాయణరెడ్డి జన్మదిన వేడుకలను మాత్రం వివాదం చేసేసారు సదరు ఎమ్మెల్యే అభిమానులు, కార్యకర్తలు. దీంత ఎమ్మెల్యేపై విమర్శలు వస్తున్నాయి.

 


ఎటువంటి హంగామా లేకుండా జన్మదిన వేడుకలు నిర్వహించాలని, పూలమాలలు, కేకు కటింగ్‌, బాణా సంచా, ఊరేగింపు వంటి హంగామాలు లేకుండా శుభాకాంక్షలు తెలపాలని ఎమ్మెల్యే ప్రకటించారు కూడా. అయితే ఇందుకు భిన్నంగా ఆలోచించిన పెదపూడిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అశ్లీల నృత్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేదికపై ఐదుగురు అమ్మాయిలతో డ్యాన్సులు చేయించారు. అశ్లీల నృత్యాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మిన్నుకుండిపోయింది. కూత వేటు దూరంలోనే పోలీసుస్టేషన్‌ ఉన్నా అశ్లీల నృత్యాలను అడ్డుకునేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బహిరంగంగా జరిగిన ఈ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అసలే అధికారంలో ఉన్న పార్టీ ఇంకా బాధ్యతగా ఉండటం పోయి మరింతగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కార్యకర్తలు. దీనిపై చెడ్డ పేరు వచ్చింది మాత్రం సదరు ఎమ్మెల్యేకే. మరి దీనిపై ఆయన స్పందనేంటో చూడాలి.

 


రెండు దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాల్లో రికార్డింగ్ డ్యాన్సులు జరిగేవి. అవి కూడా ఓ పద్ధతిలో హీరో, హీరోయిన్ల గెటప్పుల్లో చిన్నా, పెద్దా, కుటుంబాలతో సహా వీక్షించే విధంగా జరిగేవి. కానీ రానూ.. రానూ వాటి పద్ధతిని కొంతమంది మార్చేశారు. రికార్డింగ్ డ్యాన్సుల అర్ధం మార్చేసి అశ్లీల డ్యాన్సులుగా మార్చేశారు. దీంతో రికార్డింగ్ డ్యాన్సులను నిలిపేశారు. దీంతో స్థానిక కళాకారులకు పని లేకుండా పోయింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: