కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. 77 వేల ఎకరాలు కాలి బూడిద కాగా... సిటీలో కరెంటు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నీ కాలిఫోర్నియాలోనే ఉండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. 


అమెరికాలోని కాలిఫోర్నియా, వెస్ట్ లాస్ ఏంజిల్స్ అడవుల్లో పుట్టిన కార్చిచ్చు క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్న అమెరికాకు ఇదో కొత్త తలనొప్పిగా మారింది. అక్టోబర్ 23న కార్చిచ్చు రేగింది. హాలీవుడ్ నటులతో పాటూ... వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అప్పటి నుంచీ 500 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా, అవి అదుపులోకి రావట్లేదు. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అతిపెద్ద కార్చిచ్చుగా నిలిచింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఎమర్జెన్సీ ప్రకటించారు.


కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఇప్పటి వరకూ సగమే కంట్రోల్ అయ్యింది. మిగతా సగం వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రపంచంలో కాలిఫోర్నియా అడవులు ప్రత్యేకమైనవి. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్లున్నాయి. కొన్ని వందల ఏళ్ల నాటి చెట్లు అక్కడ కనిపిస్తాయి. కాలిఫోర్నియాలో కార్చిచ్చు రేగితే అది ప్రపంచానికే ప్రమాదంగా చెబుతుంటారు. 


ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగతో పరిస్థితి దారుణంగా తయారైంది. 77 వేల ఎకరాలకు విస్తరించిన మంటల్ని సగం వరకూ అదుపులోకి తెచ్చామని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. మంటల వల్ల అడవులు, చెట్లు, ఇళ్లు కాలిపోతున్నాయి. మంటలకు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఎప్పటికప్పుడు ఫొటోలను అమెరికా ప్రభుత్వానికి అందిస్తోంది. తద్వారా మంటల్ని అదుపు చేస్తున్నారు. రెండ్రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని అంటున్నారు అధికారులు.


ఇక...ప్రస్తుతం కాలిఫోర్నియాలో 30 లక్షల మందికి కరెంటు లేదు. అంతా అయోమయ పరిస్థితి తలెత్తింది కాలిఫోర్నియాలో 2019లో ఇప్పటి వరకూ 6 వేల 190 సార్లు మంటలు చెలరేగాయి. ఫలితంగా 2 లక్షల ఎకరాల్లో అడవులు తగలబడ్డాయి. అలాగే 698 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. కాలిఫోర్నియాలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా కార్చిచ్చును ఆపకపోతే... జరిగే వినాశనాన్ని అంచనా వెయ్యడం కష్టమేనంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: