ఏపీ కాంగ్రెస్‌కు కొత్త సారధి ఎవరు? రెండురోజులపాటు బెజవాడలో అధిష్ఠానం పెద్దలు చేసిన కసరత్తు ఎంత వరకూ వచ్చింది? హైకమాండ్‌కు ఎవరిపై గురి కుదిరింది?  ఏపీపీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి రాజీనామా తర్వాత  సమర్థవంతమైన నాయకుడి కోసం చూస్తోంది కాంగ్రెస్‌. ఈ వడపోతల బాధ్యతలను ఉమెన్‌ చాందీతోపాటు ఎఐసీసీ కార్యదర్శులు క్రిస్టోఫర్‌ తిలక్‌, మెయ్యప్పన్‌లకు అప్పగించింది. బెజవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో తొలిరోజు అంతర్గత సమావేశం నడిచింది. విభజన తర్వాత  ఏపీలో చతికిలపడ్డ కాంగ్రెస్‌కు మళ్లీ బలమైన టానిక్‌ ఎక్కించాలని పార్టీ అధిష్ఠానం చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే కొత్త సారథి కోసం దృష్టి పెట్టింది. రేస్‌లో సీనియర్‌ నాయకులు శైలజానాథ్‌, పల్లంరాజు, చింతా మోహన్‌, సుంకర పద్మశ్రీ, గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి వంటి వారున్నారు. వీరితోపాటు మరికొందరి పేర్లతో హైకమాండ్‌కు రిపోర్ట్‌ అందించనున్నారు పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ ఉమెన్‌ చాందీ. 


ఏపీసీసీకి చెందిన ఆఫీస్‌ బేరర్లతోపాటు మాజీ మంత్రులు,  జిల్లా అధ్యక్షులు, సీనియర్‌ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు అధిష్టానం దూతలు. నివేదికను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు సోనియాగాంధీ. ఏపీలో ఉన్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో నాయకత్వ లక్షణాలు, పోరాటాలు చేసే నాయకులకే పెద్ద పీఠ వేసే అవకాశం ఉందని గిడుగు రుద్రరాజు వంటి వారు అభిప్రాయపడుతున్నారు. 


ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే చాలా కష్టసాధ్యమైన పని. ఎంతో ఓర్పు, సహనం, పార్టీపట్ల నమ్మకం ఉన్న వ్యక్తులకే అధిష్ఠానం పెద్దపీట వేస్తుందని నాయకుల వాదన. ముఖ్యంగా సారథికి పార్టీ దిగువ శ్రేణి నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీనితోపాటు సీనియర్లను కలుపుకొని వెళ్లడం ముఖ్యం. వీటన్నింటీ బేరీజు వేసుకుంటారని చెబుతున్నారు. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ కు కొత్త పీసీీసీ ఎవరు రాబోతున్నారో..!


మరింత సమాచారం తెలుసుకోండి: