బీజేపీకి ఆయువు పట్టు బూత్ కమిటీ. ఈ కమిటీ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు సాగుతాయి. పోలింగ్ బూత్ గెలిస్తే ఆ నియోజక వర్గం గెలిచినట్టే ఇది బీజేపీ స్ట్రాటజీ. అలాంటి బూత్ కమిటీల ఎన్నికలు తెలంగాణలో నత్తనడకన నడుస్తున్నాయి. గడువు ముగిసిన టార్గెట్ మాత్రం రీచ్ కాలేదు. ఈ నెల 6న కేంద్ర పార్టీ సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్ రాధామోహన్ సింగ్ రాష్ట్రానికి రాబోతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలమైన పార్టీగా అవతరించడానికి ప్రధాన కారణం సంస్థాగతంగా బలోపేతం కావడమే. అంటే ఎన్నికలకు ప్రధాన కేంద్రమైన పోలింగ్ బూత్‌ స్థాయి నుంచి పట్టు పెంచుకోవడం. తెలంగాణలోనూ బీజేపీ అదే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. పోలింగ్ కేంద్రంగానే కార్యక్రమాలు చేస్తోంది. అయితే సంస్థాగత ఎన్నికలు కూడా పోలింగ్ బూత్ నుండే ప్రారంభం అవుతాయి. అలాంటి బూత్‌ కమిటీల ఎన్నికలు అనుకున్నంత స్పీడ్‌గా జరగడం లేదు. అధిష్టానం నిర్ణయించిన ప్రకారం బూత్ కమిటీల ఎన్నికలు సెప్టెంబర్ 30తో పూర్తి కావాలి. అదీ జరగలేదు. దీంతో అక్టోబర్‌ 31 వరకు గడవు పొడగించారు. అయినా  పూర్తి కాలేదు. 


తెలంగాణలో 34 వేలకు పైగా పోలింగ్ బూత్‌లు ఉంటే ఇప్పటి వరకు 10 వేల బూత్ కమిటీలు మాత్రమే పూర్తయ్యాయి. ఇవే ఇంత ఆలస్యమైతే... మండల కమిటీలు, జిల్లా కమిటీల ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10 వరకు మండల కమిటీలు వేయలనుకున్నా ... మూడు, నాలుగు జిల్లాలకే అర్హత లభించింది. మండల కమిటీ వేయాలంటే ఆ మండలంలోని 50 శాతం బూత్‌లలో కమిటీల ఏర్పాటు పూర్తవ్వాలి. మరో 20 శాతం బూత్‌లలో అడ్‌హాక్ కమిటీలు వేయాల్సి ఉంటుంది.  


అయితే గతంతో పోల్చుకుంటే స్పీడ్ గానే కమిటీలు ఏర్పాటవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కమలం నేతలు. కమిటీల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ చెప్పారు. ఎప్పటికప్పుడు జిల్లా అధ్యక్షుడితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 15 వరకు అన్ని కమిటీలు పూర్తి చేస్తామంటున్నారు. ఈ నెల 6న బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇంఛార్జి రాధామోహన్ సింగ్‌ తెలంగాణకు వస్తున్నారు. సంస్థాగత ఎన్నికలపై సమీక్ష చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: