రాష్ట్రంలోని 13 జిల్లాల‌కు సీఎం జ‌గ‌న్‌.. ఇంచార్జులుగా మంత్రుల‌ను నియ‌మించారు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న వారిని కూడా మార్చి.. ప‌లు జిల్లాల్లో కొత్త మంత్రుల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇలా అవ‌కాశం పొందిన వారిలో దూకుడు వ్యాఖ్య‌ల‌తో ఫైర్ బ్రాండ్ మినిస్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఇరిగేష‌న్ మంత్రి అనిల్ కుమార్‌యాద‌వ్ కూడా ఉన్నారు. ఈయ‌న‌కు జ‌గ‌న్ కోరి కోరి క‌ర్నూలు జిల్లాను అప్ప‌గించారు. దీంతో ఇక్క‌డ ఆయ‌న ఏమా త్రం ప‌ట్టుసాధిస్తారో చూస్తామ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. దీనికి కార‌ణం ఉంది. క‌ర్నూలు అంటే.. రాజ‌కీయాల‌కు ఖిల్లా!


సీనియ‌ర్ మోస్టుల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు ఇక్క‌డ ఫైర్ బ్రాండ్రే. నిత్యం ఏదో ఒక వివాదం ఉంటేనే త‌ప్ప నిద్ర ప‌ట్ట‌ని నాయ‌కులు కూడా ఈ జిల్లాలోనే ఉన్నారు. మ‌రి అలాంటి జిల్లాలో అభివృద్ధిని, రాజ‌కీయా ల‌ను రెండు ప‌ట్టాలుగా చేసుకుని రాజ‌కీయ బండిని న‌డిపించ‌డం అనేది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. పైగా టీడీపీలో కీల‌క నేత‌లు అంద‌రూ సీనియ‌ర్లే. ఒక‌రిద్ద‌రు జూనియ‌ర్లు ఉన్నా. వారు కూడా ఫైర్ బ్రాండ్లే. వీరిని లైన్‌లో పెట్ట‌డం ఆ పార్టీ అధినేత వ‌ల్ల కూడా కాని సంద‌ర్భాలు మ‌నం చూశాం.


అలాంటి జిల్లాలో ప్ర‌భుత్వం ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా.. విమ‌ర్శించేందుకు విరుచుకుప‌డేందుకు వీరు ముందుంటారు. మ‌రి అలాంటి ప‌రిస్తితిని ఇంచార్జ్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాద‌వ్ ఎలా ఎదుర్కొంటార‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. మంత్రి అనిల్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న యువ‌కుడు, దీనికితోడు దూకుడు పాళ్లు చాలా అధికం. మ‌రి అలాంటి నాయ‌కుడు ఇక్కడ ఎలా స‌మ‌న్వ‌యం చేసుకుంటార‌నేది ప్ర‌శ్న‌.


అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేయ‌డం వ‌ల్ల వైసీపీకి ఎదురు లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, వ‌చ్చే రెండేళ్ల‌లో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆశిస్తున్న విధంగా అభివృద్ధి ప‌ట్టాల‌కు ఎక్కించ‌డం, వైసీపీ నుంచి దూర‌మైన నాయ‌కులు తిరిగి వ‌స్తే.. చేర్చుకోవ‌డం వంటివి దూకుడు స్వ‌భావం ఉన్న అనిల్ కుమార్ వ‌ల్ల అవుతుందా? అనే ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: