తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు అంశాలపై చర్చించింది.  5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరిగినట్లు సీఎం కార్యాల‌యం తెలిపింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ అంశాల‌పై స‌వివ‌రంగా చ‌ర్చించార‌ని వెల్ల‌డించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1 జనవరి నుంచి 1 జూలై వరకు డి.ఎ.ను 3.144 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల మొత్తం డి.ఎ. 33.536 శాతానికి చేరుకుంటుంది.


తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ ను నిషేధించాలనే విషయంపై కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగిందని సీఎం కార్యాల‌యం వెల్ల‌డించింది.  ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి అధికారుల కమిటీని నియమించాలని కేబినెట్‌ నిర్ణయించింది. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటయన నేపథ్యంలో వాటికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించే అంశం పరిశీలించాలని కేబినెట్ పోలీసు శాఖను కోరింది. శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


కాగా,  కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు.  ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఆరోగ్యకరమైన పోటీకోసమే 5100 బస్సులను ప్రైవేట్ కు పర్మిట్ ఇవ్వడం జరిగిందన్నారు. వీలైనంత త్వరలోనే బస్సులు పల్లెవెలుగులో పరుగులు తీస్తాయన్నారు. ఆర్టీసీకి 5వేలు, ప్రైవేట్ కు 5వేల బస్సులు ఉంటాయని..ఆర్టీసీ ఆదాయం పెంచేందుకే ఈ నిర్ణయం  తీసుకున్నామన్నారు. 5100 బస్సులు ప్రైవేటుకు ఇచ్చిన పర్మిట్ కు సంబంధించినవి రవాణా శాఖ చూస్కుంటుందన్నారు. ఆర్టీసికి 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇచ్చిన డబ్బులను తమ ప్రభుత్వం ఏడాదిలోనే ఇచ్చామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: