తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పరిస్దితి ఇప్పుడెలా ఉందంటే రోజురోజుకు సమస్య క్లిష్టంగా మారుతుంది. ఒకరకంగా ఈ సమ్మె విషయంలో ఎవరు పట్టు విడవడం లేదు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం అయితే తనకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించనట్లే ఉంటుంది. ఇప్పటికే తెలంగాణాలో సమ్మె ప్రారంభించి నెలరోజులు కావస్తుంది. ఈ సమ్మె వల్ల ఉద్యోగాలు చేసుకుని బ్రతికే మధ్యతరగతి మానవుడు ఎంతలా ఇబ్బందులు పడుతున్నాడో మాటల్లో చెప్పిన అర్ధం కాదు. ఇకపోతే ఈ సమ్మె విషయంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఇది వరకే స్పష్టంచేశారు.


ఇది మా ఒక్కరి సమస్య కాదని, నాలుగు కోట్ల మంది ప్రజల రవాణాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అఖిలపక్ష నేతలతో శనివారం ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ విడిపోలేదని, అందువల్ల సీఎం తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలు చెల్లవని పేర్కొన్నారు.  తమ కార్యాచరణలో భాగంగా ఢిల్లీ వెళ్లి ఈనెల 4, 5వ తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు.


ఇకపోతే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎం మొండి వైఖరి విడనాడాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా డిమాండ్‌ చేశారు. ఇంతే కాకుండా  ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి, వాటి ఆస్తులను అమ్ముకునే కుట్రలో భాగంగానే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఇకపోతే ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తన కార్యాచరణ వివరాలను ప్రకటించింది.


అవేంటంటే మృతిచెందిన కార్మికులకు సంతాపంగా 3న అన్ని డిపోలు, మండలాలు, నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించడం.  రాజకీయ పార్టీలతో కలసి ఈ నెల 4న అన్ని డిపోల వద్ద ధర్నాలు చేయడం.. 5న సడక్‌ బంద్‌లో భాగంగా రహదారుల దిగ్బంధనం..  6వ తారీఖున అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మిక కుటుంబాలతో  నిరసన కార్యక్రమాలు చేపట్టడం. 7వ తేదిన  అన్ని ప్రజా సంఘాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం. 8న చలో ట్యాంక్‌బండ్‌ ముందస్తు సన్నాహక కార్యక్రమాలు.. 9న చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో, సామూహిక నిరసనలు చేపట్టడం అని ప్రకటించాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: