దాదాపు ఏడు నెలల తరువాత పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక పవన్ జగన్ సర్కార్ మీద మీడియా ముఖంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొత్త ప్రభుత్వానికి టైం ఇస్తాను అంటూనే తన రాజకీయ ఉబలాటాన్ని ఎక్కడా దాచుకోలేదు. కనీసం పది రోజులు కూడా కొత్త సర్కార్ కి గడవకుండానే చంద్రబాబు తో పాటు పవన్ కూడా విమర్శలకు దిగిపోయారు. ఇపుడు గట్టిగా ఆరు నెలలు కాకుండానే జనంలోకి వచ్చేస్తున్నారు.


సరే ఇప్పటి రాజకీయ నాయకులకు అంత ఓపికా, తీరిక లేదనుకున్నా పవన్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిచడం వల్ల ఏం సాధించాలనుకుంటున్నారు. ఆయనకు ఏం కావాలి అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే మొత్తానికి మొత్తం జనసేన పోగోట్టుకుంది. పవన్ సైతం గాజువాకలో ఓడిపోయారు. ఇక పార్టీ పరంగా చూసుకుంటే ఈ మూడు జిల్లాల్లో అసలు నిర్మాణమే లేదు.  పేరుకు చెప్పుకునేందుకు కొందరు నాయకులు ఉన్నా వారు జనంలోకి వచ్చింది లేదు, పెద్దగా పరిచయం ఉన్న వారు కూడా కాదు. ఈ నేపధ్యంలో పార్టీ నిర్మాణంపై పవన్ ద్రుష్టి పెట్టకుండా లాంగ్ మార్చ్ అంటూ జనంలోకి రావడం వల్ల పార్టీకి ఎంతవరకూ ప్రయోజనం అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. పవన్ పార్టీకి ఎన్నికల ముందు ఉన్న ఊపూ, ఉత్సాహం ఇపుడు అసలు లేవనే చెప్పాలి. పార్టీకి చెందిన నాయకులు వరసగా రాజీనామా చేసి తప్పుకుంటున్నారు.


వారిలో మెగాస్టార్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరు గడించిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పార్టీకి గుడ్ బై కొట్టేశారు. ఇక పవన్ లాంగ్ మార్చ్ అనగానే సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. ఇక అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్ధసారధి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. గట్టిగా నిలబడే నాయకులు లేని చోట, పార్టీ నిర్మాణం లేని చోట లాంగ్ మార్చ్ చేసినా కూడా అది పెద్దగా ఫలించదని అంటున్నారు. మరో వైపు పవన్ లాంగ్ మార్చ్ కి మద్దతు ఇవ్వడం ద్వారా టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎందుచేతనంటే ఆ పార్టీ ఇసుక పోరాటాలు ఎన్ని చేసినా జనంలో పెద్దగా మైలేజ్ రాలేదు, మరో వైపు స్వయంగా లోకేష్ దీక్షకు దిగినా కూడా పార్టీకి ఒరిగింది ఏమీ లేదు, ఇపుడు పవన్ లాంగ్ మార్చ్ లో ఆయన పక్కన నిలబడడం ద్వారా టీడీపీకే పొలిటికల్ అడ్వాంటేజ్ అంటున్నారు.


ఎందుకంటే పార్టీగా పటిష్టంగా ఉన్న టీడీపీ జనంలో ఏ మాత్రం రియాక్షన్ వచ్చినా దాన్ని ఒడిసి పట్టుకుని తమ వైపు తిప్పుకోగలదు, మొత్తానికి చూసుకుంటే రెండున్నర కిలోమీటర్ల పవన్ లాంగ్ మార్చ్ విశాఖలో కుదేలైపోయిన టీడీపీకి కొత్త వూపిరి పోస్తుందనే  చెప్పాలని అంటున్నారు. మరి ఈ విషయంలో ఆలోచన చేసుకుని సొంత కార్యక్రమాలు చేపడితేనే పవన్ జనసేనకు ఉనికీ, ఊపిరీ ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: