జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ శనివారం సాయంత్రం భారతదేశ నూతన మ్యాప్‌లను విడుదల చేసింది.జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 రూపంలో ఉన్న స్వయం ప్రతిపత్తిని పార్లమెంటు ఉపసంహరించడం, దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం తెలిసిందే. అలాగే, జమ్మూ, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా రాష్ట్రపతి ఆమోదించారు. ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ 31వ తేదీ నుంచి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం విడిపోయి.. జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం అమల్లోకి వచ్చాయి.


వాస్తవానికి కేంద్ర హోం శాఖ శనివారం మొత్తం ఐదు మ్యాపుల్ని విడుదల చేసింది.అందులో ఒకటి నూతన కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లను చూపించే మ్యాప్, వీటినే వేర్వేరుగా చూపించే మరొక రెండు మ్యాపులు.కాగా, ఈ మ్యాపుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతిని ఎందుకు చూపించలేదని, దీనికి కారణాలేంటి అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.


మరొక రెండు మ్యాపుల్లో మొత్తం భారతదేశాన్ని చూపించారు. ఒక మ్యాప్‌లో కేవలం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధాని నగరాలను మాత్రమే పేర్కొనగా.. మరొక మ్యాప్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి రాజధాని నగరాలు, జిల్లా రాజధానులు, ముఖ్య నగరాలు, రోడ్డు, రైల్వే మార్గాలను కూడా పేర్కొన్నారు.భారతదేశ పొలిటికల్ 2 మ్యాప్‌ పేరిట కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఈ మ్యాప్‌లో ఆరు వివరణల్ని కూడా పేర్కొన్నారు.


ఆ వివరణల్లో రెండు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం గురించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిపాలన హైదరాబాద్ నగరం నుంచే జరుగుతోందని అందులో పేర్కొన్నారు.అలాగే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సరిహద్దులను ఈశాన్య ప్రాంతాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం 1971ని అనుసరించి పేర్కొన్నామని, అయితే దీనిని ధృవీకరించాల్సి ఉందని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: