ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇసుక సత్యాగ్రహం తప్పదని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఆయన లేఖ రాశారు.  రాష్ట్రంలో గత 5 నెలలుగా ఇసుక సమస్య ఉందన్నారు. రాష్ట్రంలో వర్షాలు, నదులలో నీరు వల్ల ఇసుక కొరత ఉందని మంత్రులు చెప్పడం దారుణమని మండిపడ్డారు. పొరుగున పక్కన ఉన్న తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్రలలో వర్షాలు, వరదలు సంభవించలేదా అని సూటిగా ప్రశ్నించారు. మరి ఆయా రాష్ట్రాలకు లేని ఇసుక సమస్య ఎపీకే ఎందుకొచ్చిందని రామకృష్ణ నిలదీశారు.


మంత్రులు చెప్పేవన్నీ కేవలం సాకులు మాత్రమేనాని సిపిఐ నేత కొట్టిపారేశారు. ఇసుక సమస్య వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్, స్టీల్, ఇటుక, కంకర వంటి వ్యాపారులు దెబ్బతిన్నారని ఆందోళన చెందారు. ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల వంటి వాహనాలకు నెలవారీ రుణ వాయిదాలు చెల్లించే పరిస్థితి కూడా కొరవడిందన్నారు. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి ఇసుక సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలన్నారు.  కార్మికుల కుటుంబాలకు రు.20 వేలు భృతి క్రింద చెల్లించాలని డిమాండ్ చేశారు.



చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రు.10 లక్షల ఎక్స్గ్గ్ గ్రేషియా ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారం కానీ పక్షంలో  రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను, ట్రేడ్ యూనియన్లను, ప్రజాసంఘాలను సమైక్యపరచి సిపీఐ " *ఇసుక సత్యాగ్రహం* " ప్రకటించక తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.కాగా ఇసుక సమస్యపై ఆదివారం విశాఖపట్నంలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించతలపెట్టారు. పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న లాంగ్ మార్చ్ మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్రారంభం కానున్నది. లాంగ్ మార్చ్ కి ప్రతిపక్ష పార్టీల మద్దతు తెలిపాయి. ఈ లాంగ్ మార్చ్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: