ఆ పెన్నుకు దశాబ్దాల చరిత్ర ఉంది. నాటి మహాత్మా గాంధీ నుండి నేటి మోడీ వరకు ఆ పెన్నును వినియోగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వదేశీ ఐకానిక్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్‌కు, ప్రధాని మోడీ కానుకగా ఇచ్చేంత స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఏంటా పెన్ను .? ఎక్కడ తయారవుతుంది .?  అనుకుంటున్నారా. మరేంటోకాదు.. మన రాజమండ్రిలో తయారయ్యే రత్నం పెన్‌. 


భారత్‌ లో పర్యటించిన జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు ప్రధాని నరేంద్రమోడీ రెండు బహుమతులను ఇచ్చారు. వీటిల్లో ఒకటి కశ్మీరు శాలువా కాగా, రెండోది మన తెలుగు గడ్డకు చెందిన రత్నం పెన్ను. 1932లో రాజమండ్రిలో ఏర్పాటు చేసిన రత్నం పెన్ కార్నర్  ఇప్పటికీ కొనసాగుతుంది. దీనిని స్వదేశీ వస్తువుగా కానుకను సమర్పించారు ప్రధాని మోడీ. నాడు మహాత్మా గాంధీ కూడా రత్నం పెన్నును వినియోగించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాష్ట్రపతులు తొలి సంతకానికి రత్నం పెన్నునే వాడుతున్నారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన స్వదేశీ పెన్నును విదేశీయులకు గిప్ట్‌గా ఇవ్వడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 


తాము తయారు చేసే పెన్నులకు ఇంతటి పేరు రావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు రాజమండ్రి రత్నం  పెన్  తయారీదారులు. ఇది తమకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు ఆ కంపెనీ ఓనర్‌ రమణమూర్తి. పిన్ను నుంచి పెన్ను వరకు స్వదేశీ వస్తువులనే వాడాలన్న గాంధీజీ పిలుపుతో 1932లో రాజహేంద్రవరానికి చెందిన కోసూరి వెంకట రత్నం, ఆయన సోదరుడు సత్యం ప్రేరణ పొందారు. వీరు దేశంలోనే తొలిసారిగా రత్నం పెన్‌ వర్క్స్‌ పేరుతో పరిశ్రమను ప్రారంభించారు. రత్నం పెన్నును విదేశీ కలాలకు దీటైన స్వదేశీ ప్రత్యామ్నాయంగా అభివర్నిస్తూ గాంధీ మహాత్ముడు అప్పట్లో స్వయంగా లేఖ రాశారు. అంతే కాకుండా, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా 31వేల లేఖాస్త్రాలను సంధించడానికి ఈ కలాలనే వినియోగించారు. ఎందరో నాయకులు గాంధీజీని అనుసరించి వీటిని వినియోగించడంతో ఈ పెన్నులకు స్వదేశీ కలంగా గుర్తింపు లభించింది. 


భారత తొలి ప్రధాని నెహ్రూ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి రత్నం పెన్నునే వినియోగించారు. రష్యా, అమెరికా, జర్మనీ లాంటి ప్రపంచ దేశాల నేతలకు, ప్రముఖులకు రత్నం పెన్నులను పంపడం జరిగింది. ఎందరో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, న్యాయమూర్తులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఈ పెన్నులను వినియోగిస్తున్నారు. తాజాగా జర్మనీ అధినేతకు ఈ పెన్నును బహూకరించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: