రాష్ట్రంలో ఇసుక సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలు భారీగా విశాఖకు చేరుకున్నారు అయితే కార్యకర్తలు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో చేరుకోవటంతో విశాఖలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాదోపవాదాలతో అక్కడి పరిస్థితులు వేడెక్కాయి.

 

 

స్థానిక మద్దెలపాలెం వెళ్లే దారిలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గేట్లు తోసుకుని వెళ్లేందుకు కార్యకర్తల ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏయూ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి పోలీసులు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఇతర జిల్లాల నుంచి వచ్చే భవన నిర్మాణ కార్మికులు, జనసేన కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో ఇక్కడి గేట్లు మూసివేయడంతో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంగణమంతా పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు చేస్తున్న నినాదాలతో హోరెత్తిపోతోంది. తాము శాంతియుతంగా నిరసన చేపట్టాలని చూస్తుంటే ప్రభుత్వం, పోలీసులు కలిసి హింసాయుత వాతావరణం సృష్టిస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

 

 

అక్కడి అప్రోచ్ రోడ్డులో వెళ్లనివ్వకపోవడాన్ని కార్యకర్తలు ఖండిస్తున్నారు. తమ నిరసనను అణచివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏయూ వీసీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. లాంగ్‌మార్చ్ కు అనుమతి విషయంలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: