ఇసుక కొరత ఏర్పడి గత కొన్ని నెలలుగా భవన నిర్మాణాలు నిలిచిపోయి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అసమర్ధత పాలన వలనే ఇసుక కొరత ఏర్పడింది అంటూ విపక్షాలు విమర్శిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఇలాంటి విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శ, ప్రతివిమర్శల వల్ల జరిగేది ఏమీ లేదంటూ ఈరోజు విశాఖలో లాంగ్ మార్చ్ కు సిద్ధమైన విషయం తెలిసిందే.

ఈ ఆందోళనకు మిగతా పార్టీలు అయిన టిడిపి, బిజెపి ,కాంగ్రెస్ మరియు ఇతర వామపక్ష పార్టీలు సంఘీభావం తెలుపగా టీడీపీ నుంచి మాత్రం కొందరు ప్రధాన నేతలు ప్రత్యక్షంగా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు.ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడేలా లాంగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.  అలాగే ఈ మార్చ్ ను విజయవంతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం విశాఖకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్రారంభమయ్యే లాంగ్ మార్చ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ దాదాపు 2.5 కి.మీ.మేర సాగుతుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో సభను నిర్వహించనున్నారు.

అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు అనుమతులు లేవని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుందనే విషయంపై మనోహర్ సీరియస్ అయ్యారు. ఈనెల 28న అనుమతి కోరితే పోలీసులు మరియు జీవీఎంసీ వారు 30వ తేదీకి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా వేదికను రహదారిపై కాకుండా సెంట్రల్‌ పార్కు గోడకు ఆనుకుని వేసుకోవాలని శనివారం రాత్రి పోలీసులు అడ్డుతగిలారట. వేదికను మారిస్తే దానిపై ఉన్నవారెవరూ ప్రజలకు కనిపించరని, ముందు అనుమతులిచ్చినచోటే నిర్మించుకుంటామని జనసేన నేతలు పట్టుపట్టారు.

రహదారి మొత్తాన్ని వాడుకోవడానికి అనుమతించి మళ్లీ ఇలా అడ్డుకోవడం ఏంటంటూ జనసేన నేతలు మండిపడుతున్నారు. పోలీసు వారు మాత్రం సభకు అడిగిన స్థలాని కంటే ఎక్కువ స్థలాన్ని వినియోగించుకొని సభను ఏర్పాటు చేస్తున్నారంటూ... అందుకే అడ్డు చెబుతున్నాం అని అన్నారు. అందుకుగాను అక్కడ జనసేన నేతలు వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టాగా... అక్కడికి నాదెండ్ల మనోహర్ చేరుకొని పోలీసులతో చర్చించి పరిస్థితిని చక్కబెట్టి పనులన్నీ సజావుగా సాగేలా చేశారు. 

జనసేన నిర్వహించనున్న ఈ లాంగ్‌మార్చ్‌లో తమ పార్టీల నుంచి సంఘీభావాన్ని తెలిపినప్పటికీ ఆందోళనకు మాత్రం నేతలు అందరూ దూరంగా ఉంటారని కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీలు తెలిపాయి. టీడీపీ నుంచి మాత్రం మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు పాల్గొంటున్నారు. లోక్‌సత్తా నేత బీశెట్టి బాబ్జీ ఆ పార్టీ తరఫున పాల్గొంటారు


మరింత సమాచారం తెలుసుకోండి: