గ్యాస్ ఛాంబర్ లా మారిన ఢిల్లీ కాలుష్యంలో ఏ మాత్రం మార్పు కనిపించటం లేదు. సాధారణంగా వర్షం కురిసిన తర్వాత కాలుష్యం కాస్తయినా తగ్గాలి. కానీ రాజధానిలో అలాంటి ఛాయలు కనిపించటం లేదు. మరో పక్క రాజధాని  వాయు కాలుష్యంపై రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. 


దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురింది. దీంతో వాయు కాలుష్యం కాస్తయినా తగ్గుముఖం పడుతుందని అందరూ భావించారు. కానీ  గాలిలో ఎటువంటి మార్పులు  చోటుచేసుకోలేదు. ఇలా జరగడానికి కారణమేమిటని పర్యావరణవేత్తలు కూడా  తేల్చిచెప్పలేకపోతున్నారు. అయితే కొద్దిపాటి వర్షమే కురిసినందున పెద్దగా ఫలితం లేకపోయిందనీ.. అందుకే కాలుష్యం తగ్గలేదని భావిస్తున్నారు. అలాగే గాలి వీస్తున్న దిశ కూడా దీనికి కారణమని చెబుతున్నారు.


హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీవైపుకు గాలి వీస్తోంది. ఈ గాలిలో కాలుష్య కారక లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 900 పాయింట్లను దాటింది. ఢిల్లీని ఆనుకుని ఉన్న నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యం దారుణంగా పెరుగుతోంది.  ఈ కారణంగా ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.


ఢిల్లీలో ప్రస్తుతం గంటకు 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే తుపాను ప్రభావంతో ఈ నెల 7, 8 తేదీలలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో అక్కడక్కడా వర్షాలు కురుసే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో కాస్తయినా పొల్యూషన్ తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో వాయు కాలుష్యం రికార్డు స్థాయికి చేరడంతో అక్కడి ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నెల 5 వరకు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించారు. మరోవైపు పొల్యూషన్ అంశం రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బ్లేమ్‌ గేమ్ ఆడుతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. మరోపక్క ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీరియస్‌ గా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: