తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ విధించటంతో ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఉప్పల్ డిపో అసిస్టెంట్ డిపో మేనేజర్ గా పని చేస్తున్న కేశవ కృష్ణ తిరిగి విధుల్లో చేరుతున్నట్లు డిపో మేనేజర్ కు లేఖ అందించారు. కామారెడ్డి డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న సయ్యద్ హైమద్ విధుల్లో తిరిగి చేరుతున్నట్లు డిపో మేనేజర్ కు రిపోర్టు చేశారు. 
 
హైమద్ మీడియా ఎదుట రెండు నెలల నుండి జీతాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పండుగ ముందు సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. సీపీ వీసీ సజ్జనార్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే వారికి తగిన భద్రత మరియు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు. నిర్భయంగా ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరవచ్చని సీపీ సజ్జనార్ అన్నారు. 
 
ఎవరైనా విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడినా ఆర్టీసీ ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా ఆర్టీసీ ఉద్యోగులకు ఏ విధమైన నష్టం కలుగజేసినా వారిపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, ఉద్దేశపూర్వకంగా అడ్డగించినా వారిపై ఫిర్యాదు చేయమని చెప్పారు. 
 
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు ఎవరైనా ఆటంకాలు ఏర్పరిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చని నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన తెలిపారు. పోలీస్ శాఖ తరపున ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని చేతన మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: