వాట్సాప్ నిఘా వ్యవహారం మరింత ముదురుతోంది. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తల ఫోన్ లే కాదు.. రాజకీయ నేతల ఫోన్ లు కూడా నిఘా నీడలోనే ఉన్నాయనే ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతతో పాటు, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటితో ఆగే సూచనలు కనిపించటం లేదు. సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్ లే  కాదు.. ప్రతిపక్ష రాజకీయ నేతల ఫోన్లు కూడా హ్యాక్‌ అయ్యాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి.  తన ఫోన్ హ్యాక్‌ చేశారని, దానికి ఆధారాలు కూడా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి తనకు వాట్సాప్ సందేశాలు వస్తున్నాయని వెల్లడించారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమనీ, ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమంత్రిని కోరుతున్నానన్నారు. 


కేంద్రం ఇప్పటికే తన ఫోన్ ను ఎన్నోసార్లు ట్యాప్ చేయించిందనీ... దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు మమతా బెనర్జీ. కేంద్రంతోపాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు కూడా కలిసి ఈ పని చేశాయంటున్నారు మమత. విపక్ష నేతల ఫోన్ లను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్ కూడా హ్యాక్ అయ్యిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. స్నూపింగ్ సాఫ్ట్‌ వేర్‌  తో  ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసినట్లే ప్రియాంక గాంధీ ఫోన్ ను కూడా హ్యాక్ చేశారని ఫేస్ బుక్  యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్ఫామ్ నుంచి ప్రియాంక గాంధీకి ఓ మెసేజ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. మరోవైపు దేశంలోని అనేకమంది రాజకీయ నేతల, న్యాయవాదుల, ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపిస్తోంది.


తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఫోన్ లను కూడా ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న మంత్రులు, అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. కాగా ఇజ్రాయేల్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ వాట్సాప్ సర్వర్ల ద్వారా స్పైవేర్‌ తో 20 దేశాలకు చెందిన1400 మంది యూజర్లను టార్గెట్ చేసిందని వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ గతవారం ఆరోపణలు గుప్పించింది. భారత్లో లోక్సభ ఎన్నికలకు ముందు ఇలా టార్గెట్ చేసిన వారిలో జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు సహా ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. ఎన్ఎస్ఓపై ఫేస్బుక్ దావా వేయడం ద్వారా న్యాయపోరాటానికి దిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: