ఇసుక సమస్యపై జనసేన అధినేత చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో అపశృతి జరిగింది. పాత జైలు రోడ్డు ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యుద్ఘాతం జరిగి ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. హుటాహుటిని వారిని ఆంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సభ ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మీద కరెంట్ పాస్ కావడంతో కార్యకర్తలకు కరెంట్ షాక్ కు గురయ్యారు. వెంటనే అక్కడ జనరేటర్ ద్వారా పవర్ సప్లైను నిలిపివేశారు. దీంతో సభ వద్ద ఆందోళన చెలరేగింది. ప్రస్తుతం క్షతగాత్రులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.

 


సభ వద్ద ప్రస్తుతం పవర్ సప్లై నిలిపివేశారు. దీంతో సభ మీద ప్రసంగాన్ని నిలిపివేశారు. కార్యక్రమంలో పవన్ కల్యాణ్, నాగబాబు, మనోహర్, టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. అయ్యన్నపాత్రుడు ప్రసంగిస్తూండగా ఈ సంఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడ ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభకు తరలివచ్చిన పవన్ అభిమానులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్యకర్తలతో సభా ప్రాంగణం అంతా కిక్కిరిసి పోయింది. వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడింది. దీంతో పోలీసులకు అక్కడి జనసమూహాన్ని కంట్రోల్ చేయడం సవాల్ గా మారింది.

 


లాంగ్ మార్చ్ సందర్భంగా విశాఖ మొత్తం పవన్ అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది. బీచ్ రోడ్డు మొత్తం జనసేన జెండాలు ఎగిరాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. పవన్ పిలుపుకు భారీ స్పందన వచ్చిందనే చెప్పాలి. పవన్ కూడా లాంగ్ మార్చ్ కార్యక్రమంలో నడిచేందుకు వీలుకాకపోవడంతో కార్ టాప్ ఎక్కి ఆ మార్గంలో ప్రజలకు, అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వచ్చారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: