ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని దేశవ్యాప్తంగా ఓ విప్లవమే జరుగుతోంది. ప్రధాని మోదీ కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో తీసుకున్న చర్యలు ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్లాస్టిక్ ఇస్తే గుడ్లు ఇస్తామంటూ చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.

 

 

ప్లాస్టిక్ ఇస్తే గుడ్లు ఇవ్వడం ఏంటి అని ఆలోచించేవారికి వాస్తవంలో జరుగుతున్నది చూసి ఔరా అనుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించుకున్న అధికారులు ఆ దిశగా సరికొత్త ఆకర్షణీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరైనా రెండు కిలోల ప్లాస్టిక్‌ను సేకరించి ఇస్తే అర డజన్‌ గుడ్లు ఉచితంగా ఇస్తామని కలెక్టర్‌ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలనకు సంబంధించి ఆయన అధికారులతో సమావేశమై ప్లాస్టిక్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్లాస్టిక్ ను ఇచ్చిన వారికి గుడ్లు ఇవ్వాలని ఈ సమీక్షలో ప్రతిపాదించారు. జిల్లాలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించారు. ఈ నెల 4 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు తెలపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కూడా గుడ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గుడ్లను స్థానికంగా ఉండే కిరాణ షాపుల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

 


దేశంలో ప్లాస్టీక్ వినియోగం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని చాలా నగరాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేశాయి. ఇందులో భాగంగా ప్లాస్టీక్ కవర్ల వినియోగంపై మొదటగా నిషేధం విధించారు. దీంతో క్లాత్ కవర్లు వినియోగం పెరిగి ఓ అడుగు ముందుకు పడిందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: