అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాను వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాలు వేగవంతంగా సాగుతున్నాయ‌ట‌. గ‌తంలో చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. సంస్థలో తనకున్న 100 శాతం వాటా ను విక్రయించడానికి నవంబర్‌లో బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన దాన్ని నిజం చేస్తూ.... పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ చాలా చురుకుగా సాగుతున్నదని ప్ర‌క‌టించారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ ప్రక్రియ ముగియగలదన్న ఆశాభావాన్ని ఆయన ఇక్కడ వ్యక్తం చేశారు. 


గురునానక్ బోధనలపై ఓ భారతీయ ఇనిస్టిట్యూట్ వార్షికోపన్యాసం ఇచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హమ్‌కు చేరిన కేంద్ర మంత్రి పూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు.. విమానయాన రంగంలో కొనసాగలేవన్నారు.  వచ్చే దశాబ్ద కాలంలో దేశ ఆర్థిక ప్రగతిలో పౌర విమానయాన రంగం ఎంతో కీలకమైనదిగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేప‌థ్యంలో...ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు భారతీయ విమనయాన రంగంలో చాలామంది పోటీపడుతున్నట్లు చెప్పారు. ఎయిర్ ఇండియా వాటా విక్రయంలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా పకడ్బందీగా ముందుకెళ్తున్నామన్నారు.  


 రూ.58 వేల కోట్ల స్థాయి రుణ సంక్షోభంలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థ..ప్రస్తుతం రోజువారి ఇంధనం కొనుగోలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లు కొన్ని విమానాశ్రయాల్లో ఇంధన సరఫరాను నిలిపివేశాయి కూడా. గ‌త‌ నెల మొదట్లో ఎయిర్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ కూడా ప్రైవేటీకరణకు సంబంధించి చర్చించింది. ఈ ప్రైవేటీకరణపై సంస్థ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగాలు పోతాయనే భయం వారిలో నెలకొన్నది. ప్రత్యేక పర్పస్‌ వెహికల్‌, ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(ఏఐఏహెచ్‌ఎల్‌)కి చెందిన బాండ్లను జారీ చేయడం ద్వారా సేకరించనున్న నిధుల్లో రూ.30 వేల కోట్లను ఎయిర్‌ ఇండియా అప్పు తీర్చడానికి ప్రత్యేక ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చింది. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఎయిర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఈఎస్‌ఎల్‌), హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(హెచ్‌సీఐ)లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ నిమిత్తం రుణాలు ఇవ్వడానికి ఏఐఏహెచ్‌ఎల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: