సమ్మెపై ప్రభుత్వం విధించే డెడ్ లైన్లకు కార్మిక లోకం భయపడబోదని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మెకు సరైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత సర్కారుదేనని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్ లో సమావేశమైన యూనియన్ నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 


ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ విధించిన ఐదో తేదీ డెడ్ లైన్ పై కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమనీ, కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేరబోరని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కేసీఆర్ విధించిన డెడ్ లైన్లలో ఇప్పటి వరకూ ఇది నాలుగోదని  చెప్పారు. ఐదు వేల పైచిలుకు బస్సులను ప్రైవేట్ పరం చేస్తాననటం సరికాదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నందునే 5న రహదారుల దిగ్బంధం వాయిదా వేసుకున్నామని ప్రకటించారు అశ్వత్థామ రెడ్డి. అయితే ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కొత్త సమస్యలు సృష్టించేలా ఉన్నాయన్నారు అశ్వత్థామ రెడ్డి. ఆవేదనతో కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని... సమ్మెపై చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమ్మెలో రాజకీయ నాయకులు చేరి కార్మికులను రోడ్డు పైకి తీసుకొచ్చారని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఆయా రాజకీయ పార్టీలు బాబు మృతిని వాడుకున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి వైఖరి సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కార్మికులపై కక్షసాధింపు సరికాదన్నారు. 


సీఎం కేసీఆర్ మాటలు చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టు ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్టీసీ సహా తెలంగాణలోని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు  భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి  కేసీఆర్‌ పిలుపుతో పలు చోట్ల ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. అయితే వీరిపై ఎవరైనా బెదిరిపులు, భౌతిక దాడులకు దిగితే  చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: