ఇసుక లేక ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రభుత్వానికి రెండు వారాలు టైమ్ ఇస్తున్నా. ఒకొక్క భవన నిర్మాణ కార్మికుడికి 50వేలు ఇవ్వాలి. ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న 36 మంది భవన నిర్మాణ కుటుంబాలకు ఒకొక్కరికీ 5లక్షలు ఇవ్వాలి. రెండు వారాల్లో స్పందించకపోతే అమరావతి రోడ్లపై నడిచి సత్తా చూపిస్తా’నని అన్నారు.

 


భవన నిర్మాణ కార్మికులు లేకపోతే జీవితం రథచక్రాలు ఆగిపోతాయన్నారు. వారి సమస్యలు పట్టించుకోకుండా నన్ను విమర్శిచడంపైనే వైసీపీ వాళ్లు దృష్టి పెట్టడం తగదన్నారు. ఓడిపోవటం తనన్నెప్పుడూ బాధించలేదని.. పోరాటం చేయడంలో తనకు తృప్తి ఉందన్నారు. ఓడిపోతే భయపడే వ్యక్తిని కానని అన్నారు. 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోవడం బాధిస్తోందన్నారు. ప్రజలు రోడ్ల మీదకు రావడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. జనాభా పెరుగుతోంది.. భవనాలు నిర్మిచాలి, విద్యార్ధులకు స్కూళ్లు, కాలేజీలు నిర్మించాలి.. ఈ పనులు ఆగిపోతే ఎలా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో తప్పులుంటే సరిజేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్య ఏ ఒక్కరి సమస్యో కాదన్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా ఈ సమస్యను అధిగమించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగేంతవరకూ జనసేన తోడుగా ఉంటుందన్నారు.

 


ఈ సందర్భంగా మంత్రి కన్నబాబుపై, ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. మేము రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కన్నబాబు తనను విమర్శించే హక్కు లేదన్నారు. తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడనని ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. తాను టీడీపీకి దత్తపుత్రుడునని, బీటీమ్, డీఎన్ ఏ అంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.. తాను కష్టాల్లో ఉన్న ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడినని అన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: