జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వ‌హ‌ణ‌, ఈ సంద‌ర్భంగా చేసిన కామెంట్లపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్ ఘాటుగా స్పందించారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులపై పవన్‌ కళ్యాణ్‌ది కపట ప్రేమ అని మండిప‌డ్డారు. ``అసలు లాంగ్ మార్చ్ అనే పదానికి అర్ధం ఎలా వచ్చిందో పవన్‌ కళ్యాణ్‌ కు తెలుసా? కమ్యూనిస్ట్ నేత మావో ప్రపంచం కోసం చేసిన పదివేల కిలోమీటర్ల మార్చ్‌ను కీర్తిస్తూ పెట్టిన పేరు లాంగ్ మార్చ్. రెండు కిలోమీటర్లు కూడా కాళ్లతో నడవలేక... సినీ ఫీట్లను కారులోంచి చూపించారు. దాన్ని లాంగ్ మార్చ్ అంటారా? ` అని ప్ర‌శ్నించారు.


ప‌వ‌న్‌తో పాటు విశాఖలో వేదికపై ఉన్న వ్యక్తులను చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారని అమ‌ర్‌నాథ్ అన్నారు. ``గత అయిదేళ్లుగా శాండ్ మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్ అచ్చెంన్నాయుడు ఉన్నారు. డ్రగ్ మాఫియాకు డాన్‌గా అయ్యన్నపాత్రుడు ఉన్నాడు. వీరిద్దరిని చెరోవైపు పెట్టుకుని పవన్‌ వేదాలు వల్లించారు. రాష్ట్రంలో ఇసుక కొరత అనేది ప్రకృతి వైఫరీత్యం వల్ల వచ్చిన సమస్య. విశాఖలో ఏ నది ఉందని ఇక్కడ పాదయాత్రకు పిలపునిచ్చారు పవన్‌? ఏ గోదావరి, కృష్ణానది పక్కన ఈ కార్యక్రమం పెట్టి వుంటే...ఈ నదుల్లో ఇంత ప్రవాహం వుంటే... ఇసుక ఎలా తీస్తారని ప్రజలు నిన్ను ప్రశ్నించి ఉండేవారు. మీ పార్టీ కార్యకర్తలు, మీ అభిమానులకు అసలు విషయం తెలిసి ఉండేది.`` అని ఎద్దేవా చేశారు.


ప‌వ‌న్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో భవన కార్మికులు ఎక్కడా కనిపించలేదని ఆయ‌న పేర్కొన్నారు. ``కార్మికుల‌కు ఇసుకపై వాస్తవాలు తెలుసు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తోంది. అయిదు నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తోంది. అయ్యన్నపాత్రుడు విశాఖలో వైసీపీ నేతలు భూములను దోచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వారి మాటలు చూస్తుంటే దొంగలు... దొంగలు ఊర్లు పంచుకున్న ఉదంతం గుర్తుకు వస్తోంది. గత అయిదేళ్లుగా టిడిపి రాష్ట్రంలో చేసిన దోపిడీ ప్రజలకు తెలుసు. దానికి వత్తాసు పలికిన పవన్ ఏ విధమైన కార్యక్రమాలు చేశారో చూశాం. ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించకుండా పవన్‌ కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం తాను ఓడిపోయిన గాజువాకలో ఈ ర్యాలీ చేసి ఉంటే...తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో పవన్‌ కు తెలిసి ఉండేది.`` అని వ్యాఖ్యానించారు.


త‌మ‌ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబుతో పాటు ఈ జిల్లా మంత్రిని విమర్శించే హక్కు పవన్‌ కు ఎక్కడిదని అమ‌ర్‌నాథ్ ప్ర‌శ్నించారు. ``మాట్లాడితే సినిమాలో వచ్చే డబ్బును వదలుకుని వచ్చానని అంటావు.మీకు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు మీ కోసం తిరుగుతున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్లను రోడ్డున పడేశారు. వారి గురించి ఎనాడైనా ఆలోచించారా? సినిమాల నుంచి వచ్చి ఒక్క చోట కూడా గెలవలేదు. మీ తోటి నటుడు బాలకృష్ణ‌ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. ఆయనను చూసి పవన్‌ సిగ్గు తెచ్చుకోవాలి. తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సాక్షిగా జగన్‌ అధికారంలోకి వస్తే పేరు మార్చుకుంటానని అన్నారు. మీ మాటల మీద మీకే నమ్మకం లేదు. రోజుకో రకంగా మాట్లాడటం మీకు ఆలవాటు. ఒకచోట మాట్లాడిన మాట.. మరోచోట మాట్లాడరు. టిడిపి దోపిడీకి పవన్‌ కళ్యాణ్‌ వత్తాసు పలుకుతున్నారు. భవన కార్మికుల సమస్యపై మీరు వేదాంతం చెబుతున్నారు.ఈ రోజు ప్రజలు మీ మాటలు విని నమ్మె పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికులు లేరు`` అని స్ప‌ష్టం చేశారు.


ఇటీవ‌లే రాష్ట్ర ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పుఇచ్చారని అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు.``సుమారు నూటా నలబై సీట్లలో పోటీ చేస్తే... ఎక్కడైనా మీకు డిపాజిట్‌ వచ్చిందా..? ఒక్క సీటు మాత్రం గెలిచారు... ఇదీ మీ పరిస్థితి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలనే జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.  మీలాగా రెండు లక్షల పుస్తకాలను మేం చదవలేదు. మీలాగా అర్ధంలేని సవాల్‌ విసరడం మాకు తెలియదు. పదిహేను రోజులు గడువు ఇస్తున్నామని అన్నారు... ఎవరికి మీరు గడవు ఇస్తున్నారు? రాష్ట్రంలో వరదలు తగ్గితే ఇసుక సమస్య వుండదు. దీనిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడతారా?నదుల్లో వరద ఉన్నప్పుడు ఇసుక ఎలా తీస్తారు? మాకు వారం రోజులు సమయం ఇస్తే చేసి చూపిస్తామంటూ మీ పక్కన వున్న వారు మాట్లాడుతున్నారు. ఇలా ప్రజలను మభ్యపెట్టే మాటలు అన్నందుకే మీకు తగిన బుద్ది చెప్పారు.`` అని వ్యాఖ్యానించారు.


త‌మ ఎంపీ విజయసాయిరెడ్డి గారి గురించి అవాకులు మాట్లాడుతున్నారని అమ‌ర్‌నాథ్ అభ్యంత‌రం తెలిపారు. `` దేశంలో ఏం జరుగుతుందో తెలుసు అంటారు. ఢిల్లీలో తనకు అన్నీ తెలుస్తాయంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. దీనిని బట్టి బీజేపీతో మీ లాలూచీ ఏమిటో అర్ధమవుతోంది. మీ రాజకీయ పరిణితి బయటపడుతోంది. ఇప్పుడు మాట్లాడిన మాటలు రేపు మాట్లాడరు...కేవలం స్ర్కిప్ట్ ను బేస్ చేసుకునే మాట్లాడతారు...ఒకచోట మాట్లాడిన మాటలు మరోచోట మాట్లాడరు. పొలిటికల్‌ కాల్షీట్ లకు, నారా వారి బ్యానర్ కే కట్టుబడి వున్నారు. లాంగ్ మార్చ్ వంటి కార్యక్రమాలతో ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఇసుకను జాతీయ సమస్యగా చూపి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేయవద్దు.  తప్పుడు నాటకాలను ప్రజలు విశ్వసించరు...సిఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ది వున్న నాయకుడు. నిత్యం ప్రజలకు ఏదోఒక మేలు చేయాలనే తపనతో పనిచేస్తున్నారు. ఇసుక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారు`` అని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: