విశాఖ కేంద్రంగా....భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా  లాంగ్ మార్చ్ చేపట్టిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ కేంద్రంగానే మ‌రో రెండు రోజుల కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. మరో రెండు రోజుల పాటు విశాఖలోనే బస చేసి పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ జిల్లా నుంచి అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్ధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని జ‌న‌సేన పార్టీ వెల్ల‌డించింది.


కాగా, ఇసుక లభ్యత లేకపోవడం మూలంగా అయిదు నెలల నుంచి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల కష్టాలను తెలిపేందుకు ఆదివారం విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేపట్టారు. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జి.వి.ఎం.సి. గాంధీ విగ్రహం వరకూ ఈ మార్చ్ సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు, జన సైనికులు  పాల్గొన్నారు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నెలల తరబడి ఉపాధి లేక రోడ్డునపడ్డారు... వారి కష్టాలను రెండు వారాల్లోగా పరిష్కరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గడువులోగా ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లోనే భవన నిర్మాణ కార్మికులకు అండగా నడుస్తాను అని ప్రకటించారు. ఎవరు వచ్చి ఆపుతారో చూస్తాను... పోలీసులని పెట్టుకొంటారో, ఆర్మీని తెచ్చుకొంటారో  అన్నారు.


ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ప‌వ‌న్ రెండురోజుల విశాఖ టూర్ షెడ్యూల్‌ను పార్టీ విడుద‌ల చేసింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు జ‌న‌సేన అధ్య‌క్షుడు ఈ స‌మావేశాలు ఏర్పాటు చేశారు. యాదవ జగ్గరాజుపేటలోని అప్పీరల్ ఎక్స్ పోర్టు పార్క్ వెనుక ఉన్న గ్రీన్ సిటీ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం జరుగుతాయి. నవంబర్ 5వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్ధులతో సమీక్షా సమావేశం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు గాజువాక జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశాన్ని నిర్వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: