మహారాష్ట్ర రాజకీయాలు అనుకున్నట్లే మలుపులు తిరుగుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్న శివసేన చివరకు పెద్దన్నలాంటి బిజెపికి షాక్ ఇవ్వటానికే నిర్ణయించుకున్నట్లుంది. ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి రెడీ అయిపోయింది. పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తమకు సిఎం పోస్టు ఇవ్వటానికికి బిజెపి ఇష్టపడకపోతే  ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి 175 మంది ఎంఎల్ఏల బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటించేశారు.

 

సంజయ్ రౌత్ తాజా ప్రకటనతో ఒక విధంగా బిజెపి నేతల్లో టెన్ఫన్ మొదలైపోయింది. బిజెపి తో చర్చలంటూ జరిగితే ముఖ్యమంత్రి పీఠం మీదే తప్ప మరోటి కాదని కూడా రౌత్ ప్రకటించటం గమనార్హం. ప్రస్తుతం 288 సీట్లున్న  మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 105 మంది ఎంఎల్ఏలున్నారు. శివసేనకు 56 మంది శాసనసభ్యుల బలముంది.

 

అలాగే ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44 మంది ఎంఎల్ఏల బలముంది. నిజానికి బిజెపి, శివసేన కూటమే సింపుల్ మెజారిటితో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఎటువంటి సమస్యా లేదు. కాకపోతే సిఎం పదవి విషయంలో ఎవరికి వారుగా పట్టుదలకు పోవటంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన వచ్చింది.

 

అదే సమయంలో ఎన్సీపి, కాంగ్రెస్ కు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు అవకాశమే లేదు. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు దూరంగానే ఉండిపోయింది. కాకపోతే మిత్రపక్షాల మధ్య ఏర్పడిన వివాదాలతో ఎన్సీపి, కాంగ్రెస్ లో ఆశలు మొదలైంది. నిజంగానే శివసేన గనుక ముందెకొస్తే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటమన్నది బిజెపికి పెద్ద షాకనే చెప్పాలి.

 

అదే జరిగితే మరి  వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయటాన్ని బిజెపి చూస్తు కూర్చుంటుందా ? అందుకనే ఈ ముగ్గురి కలయికలో ఏర్పడే ప్రభుత్వ ఆయుర్ధాయం ఎంతకాలం అన్నదే సస్పెన్స్. అందుకే ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెస్తామని కూడా బిజెపి నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి తమకు దక్కని అధికారాన్ని ఇంకోరికి దక్కనిచ్చే అవకాశం కూడా లేదన్నది స్పష్టం. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: