నల్గొండ జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. దేవరకొండలో విధులు నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డి అనే ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిన్నటివరకు జైపాల్ రెడ్డి ఆర్టీసీ సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో జైపాల్ రెడ్డికి గుండెపోటు రావటంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా జైపాల్ రెడ్డి మార్గమధ్యంలో మృతి చెందాడు. 
 
ఆర్టీసీ కార్మికుడు జైపాల్ రెడ్డి మృతితో నల్గొండ జిల్లా ఆర్టీసీ కార్మికులు ధర్నా మరింత ఉధృతం చేశారు. జైపాల్ రెడ్డి మృతదేహంతో దేవరకొండ బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు దేవరకొండ బంద్ కు పిలుపునిచ్చారు. జైపాల్ రెడ్డి మరో ఆరు నెలల్లో రిటైర్ కావాల్సి ఉండగా ఇంతలోనే ఇలా జరగడం బాధిస్తుందని ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. 
 
జేఏసీ నాయకుల పిలుపు మేరకు దేవరకొండలో ప్రస్తుతం బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ బస్సులను డిపోల నుండి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లో చేరకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం దేవరకొండలో బంద్ కు కార్మికులు, జేఏసీ నాయకులు పిలుపునివ్వటంతో భారీ స్థాయిలో పోలీసులను మోహరించింది. 
 
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ విధించటంతో ఇప్పటివరకు 12మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. పోలీసులు ఎవరైనా విధుల్లో చేరితే వారికి తగిన రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాలు అత్యవసర సమావేశం కానున్నాయి. కార్మికుల నిర్ణయమే తుది నిర్ణయంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో కార్మికులు, నేతలు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: