ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం దగ్గర కంటైనర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లగా మరో ప్రమాదంలో కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెన సమీపంలో తూర్పు డెల్టా ప్రధాన కాల్వలోకి కంటైనర్ దూసుకెళ్లింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

చెన్నై నుండి ఒడిశాకు హోండా కార్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. కంటైనర్ క్యాబిన్ కాల్వలోకి పూర్తిగా 
మునిగిపోవటంతో కంటైనర్ లో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియటం లేదు. పోలీసులు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి కంటైనర్ లో ఉండవచ్చని భావిస్తున్నారు. కంటైనర్ నీటిలో పూర్తిగా మునిగిపోయి ముందుభాగం నలిగిపోయింది. హైవే సిబ్బంది లోపలికి వెళ్లి చూసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

పోలీసులు క్రేన్ సహాయంతో కంటైనర్ ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.పోలీసులు కంటైనర్ ను బయటకు తీయటం కొరకు భారీ క్రేన్లను రప్పిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని చీరాలలో ఒక కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. చీరాల వైపుకు పరుచూరు నుండి వెళుతున్న కారు వంతెన వద్దకు రాగానే అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు పంట కాల్వలోకి దూసుకెళ్లింది.

ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు వేగంగా వెళ్లటం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: