హరినామ కీర్తనలు వినిపించాల్సిన చోట.. హారన్‌ల మోత మెగుతోంది. ఓ వైపు పెద్ద ఎత్తున వస్తున్న యాత్రికులు, మరోవైపు పెరిగిపోతున్న సిటీ కల్చర్‌తో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం నగరవాసులకు ఇదే పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. 


ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుపతికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉన్న తిరుపతిలో.. గత పదేళ్లుగా అనేక మార్పులు వచ్చాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న లక్షల మంది భక్తులతో పాటు.. చుట్టు పక్కల ఉండే ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చే జనాలతో నగరం కిటకిటలాడుతోంది.


ఎన్నో అనుకూలతల కారణంగా తిరుపతిలో స్థిరపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నగర శివారులు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో.. నగర జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. ఇంత అభివృద్ధి చెందుతున్నా.. రోడ్లు, మౌళిక సదుపాయాలు మాత్రం ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో.. అలానే ఉన్నాయి. దీంతో తిరుపతిలో ఒక్కో వాహనం గంటకు సుమారు 12 కిలోమీటర్లు మాత్రమే వెళుతుందంటున్నారు అధికారులు.


ప్రతి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. అధికారికంగానే రోజుకి 3,650 బస్సుల్లో లక్షా ముప్పై వేల మంది ప్రయాణీకులు నగరంలో రాకపోకలు సాగిస్తుంటారు. వీటితో పాటు పక్క రాష్ట్రం బస్సులు, టూరిస్ట్ వెహికల్స్ సందడి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరోవైపు కార్లు, ద్విచక్ర వాహనాల వినియోగం గతంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. ఇక ఆటోలైతే నగరంలో 20 వేలకు పైనే ఉన్నాయి. దీంతో.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని దాటుకొని ఎప్పటికి తిరిగి వస్తారో చెప్పలేని పరిస్థితి.


ఆ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఏర్పాటవుతోన్న గరుడ వారధి.. పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ పనుల కారణంగా ట్రాఫిక్ కష్టాలు మరిన్ని పెరిగాయి. ఐదు కిలోమీటర్లు వెళ్లాలంటే.. అర్ధగంట పైగా సమయం పడుతోంది. తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్ళే భక్తులకు మరింత చికాకు పుట్టిస్తోంది ట్రాఫిక్.  మరోవైపు.. వారధి పనులు, వర్షాలతో నగరంలోని రోడ్లన్ని గుంతలుగా మారిపోయాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు ప్రజలు. గుంతల వల్ల ప్రమాదంలో పడిన వారు పదుల సంఖ్యలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. రోడ్డు గురించి తెలిసిన స్థానికుల పరిస్థితే ఇలా ఉంటే శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారి పరిస్థితి ఇక వర్ణనాతీతం.

మరింత సమాచారం తెలుసుకోండి: