అయోధ్య తీర్పు రాబోతుండటంతో అంతా అప్రమత్తమవుతున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ మంత్రులను అలర్ట్ చేశారు. తీర్పు రానుండటంతో నోరు జారొద్దని ఆదేశించారు. అటు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా... అలర్టైంది. పోలీసులకు సెలవులను రద్దు చేసింది. 


వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం మరికొద్ది రోజుల్లో తుది తీర్పు ఇవ్వనుంది. సుదీర్ఘ విచారణ తరువాత వచ్చే ఈ తీర్పు పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దేశంలో అత్యంత సున్నితాంశమైన ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్పు వచ్చినా... దానిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యే అవకాశముంది. ఇలాంటి సమయంలో రాష్ట్రప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. తీర్పు సందర్భంగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయరాదంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. తీర్పు వచ్చే వరకు నోర్లకు పనిచెప్పకండని సహచరులను కాస్త గట్టిగానే హెచ్చరించారని తెలుస్తోంది. 


తీర్పునకు ముందుగానే అధికార ప్రభుత్వానికి అనూకూలంగా ఉంటుందంటూ అర్థం వచ్చేలా ఎటువంటి వ్యాఖ్యలూ చేయవద్దని మంత్రులకు యోగీ సూచించారు. ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా.. వేడుకలు చేసుకోకూడదనే నిబంధన విధించింది. అటు ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా దీనిపై సమావేశాలు కూడా నిర్వహించింది. భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించింది. 


తీర్పు తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి పోలీసులకు సెలవులు రద్దు చేసింది. మిలాద్‌ ఉన్‌ నబీ, గురునానక్‌ జయంతిలాంటి పర్వదినాలతో పాటు అయోధ్య కేసులోనూతీర్పు వెలువడనుంది. దీంతో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని నవంబరు 1 నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి సెలవులు తీసుకోకుండా నిషేధం అమల్లోకి వస్తుంది. మళ్లీ ఉత్తర్వులు వచ్చేంత వరకు పోలీసులు సెలవు పెట్టకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకోవాల్సి వస్తే సీనియర్ల అనుమతి తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: