కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటు ఘటనపై మాజీ ఎంపీ హర్ష కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఈ తరహా బోటు ప్రమాదాలు భవిష్యత్తులో మరొకటి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించాలంటూ ఆయన తన పిటిషన్ లో కోరారు. ఈ బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

 

 

ఇప్పటికే మునిగిన ప్రాంతం నుంచి బోటు వెలికితీసినందున ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 50 మందికి  పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మునిగిపోయిన బోటు మంత్రి అవంతి శ్రీనివాస్ కి చెందినదేనని, నది పోటు మీద ఉన్నా కూడా బోటు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది మంత్రి ఒత్తిడి వల్లేనని హర్ష కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే.    దీనిపై వైసీపీ ప్రభుత్వం నిజాలు దాస్తోందని ఆయన నిరసన వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. బోటు వెలికితీతలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆయన సుప్రీం కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన కోర్టు ఈరోజు స్పందించింది.

 

 

బోటు ప్రమాదం సమయంలో వరద ఉధృతి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ తర్వాతి రోజుల్లో ఉంది. 200 అడుగుల పైగా లోతులో ఉండి పోయిన బోటు వరద ఉదృతికి బురదలో కూరుకుపోయింది. ఎన్నో ఆటంకాల మధ్య కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం కొందరు నిపుణుల సాయంతో బోటును వెలికితీశారు. ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వం నుంచి నిబంధనలు కఠినతరం చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసిన నోటీసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: