కేసీఆర్ విధించిన డెడ్ లైన్ కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు కార్మికులు ఆత్మగౌరవాన్ని చంపుకొని విధుల్లో చేరవద్దని పిలుపునిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ మాట వినాలో లేక జేఏసీ నాయకుల మాట వినాలో అర్థం కాక ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. విధుల్లో చేరాలా..? వద్దా...? అనే విషయం గురించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 
 
ఇప్పటికే కొందరు ఆర్టీసీ కార్మికులు లేఖ సమర్పించి విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరటానికి ప్రయత్నిస్తుంటే కొన్ని చోట్ల కార్మిక సంఘాలు అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే విధుల్లో చేరే కార్మికులను ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. జేఏసీ నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల గురించి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో వ్యవహరించిన తీరు గురించి ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపిన సమయంలో ప్రవర్తించిన విధానం గురించి అమిత్ షాకు వివరించాలని జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు చెబుతున్నారు. 
 
ఆర్టీసీ కార్మికులు సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలో బస్సులు రోడ్డు మీదకు రాకుండా అడ్డుకున్నారు. కొత్తగూడెం డిపో దగ్గర కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవటంతో పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో కార్మికులు రహదారిపై బైఠాయించారు. పోలీసులు కార్మికులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కేంద్రం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో జోక్యం చేసుకుంటే సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: