హైద‌రాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం జ‌రిగింది. తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ విజయరెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించ‌డంలో తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘ‌ట‌న‌ను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఉద్యోగుల భ‌ద్ర‌త‌పై ఆలోచించాల‌ని కోరాయి. 


దుండ‌గుడు భోజన విరామ సమయంలో త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో జనం తక్కువగా ఉండ‌టాన్ని గ‌మ‌నించి...త‌హ‌శీల్దార్ చాంబ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి...పెట్రోల్ పోసి నిప్పంటించిన‌ట్లు స‌మాచారం.  మధ్యాహ్నం 1.20గంటలకు తహశీల్దారు ఆఫీసులోకి చొరబడ్డ హంతకుడు అరగంటపాటు ఆమె రూమ్‌లో ఉన్నాడు. మాట్లాడుతూ.. మాట్లాడుతూనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏం జరుగుతోందో తెలీక విజయ ఆఫీసులో హాహాకారాలు పెట్టింది.  కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.  విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. హంతకుడిని హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కాగా, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ సివిల్ సర్వీసెస్  ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించింది. అబ్దుల్లాపూర్‌మెట్ తాహసిల్దార్ కార్యాలయంలోనే తహసిల్దార్ శ్రీమతి విజయను అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అధ్యక్షుడు  కే చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి మధు ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ సివిల్ సర్వీసెస్  ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ తరఫున విజయ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మున్ముందు ఇటువంటి పాశవిక దాడులు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 


రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే.గౌతమ్ కుమార్ ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. ``పట్టపగలు ఒక మహిళా ఉద్యోగిని ఇలా క్రూరంగా హత్య చేయటం అత్యంత దారుణం. చాలా హేయమైన చర్య. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏవిధంగా పనిచేయాలని మా మహిళా ఉద్యోగులు విలిపిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే ఘోరమైన అన్యాయం ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.దోషుల్ని ఎంత టి వారైనా వదలవద్దు. ఇలాంటి సమయంలో రెవిన్యూ ఉద్యోగులందరు ఏకతాటిపై  వుండాలి.మనోనిబ్బరంతో ,ధైర్యంగా ఈ పరిస్థితి ఎదుర్కుందాము. విధులను బహిష్కరించి నిరసన తెలపవలసిందిగా పిలుపునిస్తున్నాం.`` అని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: