దేశంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.  ఈ దాడుల కారణంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.  బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.  అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినపుడే స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్ముడు చెప్పిన సంగతి తెలిసిందే.  అర్ధరాత్రి కాదు... కనీసం పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది.  పట్టపగలు అందరూ చూస్తుండగానే మహిళలను హత్య చేస్తున్నారు.  మారణహోమం సృష్టిస్తున్నారు.  


పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు.  మహిళా హత్యలు కేవలం ఇంట్లోనే అనుకుంటే పొరపాటే.. చివరకు ఆఫీసుల్లో కూడా హత్యలు చేస్తున్నారు.  సాధారణ ఉద్యోగుల నుంచి అధికారి స్థాయి మహిళల వరకు ఈ హత్యలు తప్పడం లేదు.  నగర శివారులోని అబ్దుల్లాపూర్ మేట్ లోని తహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలు ఓ దుండగుడు ప్రవేశించి తహసీల్దార్ పై పెట్రోల్ పోసి తగలపెట్టాడు అంటే మహిళలకు భద్రతా ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  


పైస్థాయిలో ఉన్న మహిళ అధికారులు రక్షణ లేకుండా పోయింది.  మహిళ అధికారుల దగ్గరకు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలియడం లేదు.  వచ్చిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు.  భూమి రిజిస్ట్రేషన్ ఆలస్యం అయ్యిందని చెప్పి ఆమెపై భౌతిక దాడిచేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టే వరకు వచ్చింది అంటే ...సమస్య ఎంత సీరియస్ గా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  


ఇంట్లోనే కాదు మహిళకు ఆఫీస్ ల్లో కూడా రక్షణ లేదు అని స్పష్టంగా తేలిపోయింది.  ఇది ఇలానే కంటిన్యూ అయితే.. భవిష్యత్తులో మహిళలు ఆఫీస్ లకు వచ్చేందుకు భయపడతారు.  ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఉండాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.  తాజా ఘటన తరువాతైనా ప్రభుత్వం స్పందించి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే మంచిది.  లేదంటే మహిళలు మాత్రమే కాదు తహసీల్దారులు ఎవరైనా సరే ఆఫీస్ లకు వెళ్లాలంటే భయపడతారు అనడంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: