జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన లాంగ్‌మార్చ్‌లో పాల్గొని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డిన  టీడీపీ నేత‌, ఏపీ మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడుకు మ‌రుస‌టి రోజే...వైఎస్ జ‌గ‌న్ షాకిచ్చారు. అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరారు. ఇటీవ‌లే తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న తాజాగా వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. అయ్యన్న పుట్టినరోజు నాడు సోదరుడికి బర్త్ డే బ‌హుమ‌తి అన్న‌ట్లుగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన  స‌న్యాసిపాత్రుడు తాజాగా వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత స‌మ‌క్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం...గత కొంతకాలంగా అన్నదమ్ములైన‌ అయ్యన్న పాత్రుడు, సన్యాసి పాత్రుడుల  మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.  ఈ వైరం వ‌ల్లే సన్యాసి పాత్రుడు వైసీపీ వైపు మొగ్గుచూపార‌ని స‌మాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీపై సన్యాసి పాత్రుడుకి మంచి పట్టు ఉండటంతో వైసీపీ నేతలు సన్యాసి పాత్రుడిని పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. చివరకు ఇరువ‌ర్గాల ప్రయత్నాలు ఫలించి సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరారు.


అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు లోకేష్ నర్సీపట్నం వెళ్లారు. నర్సీపట్నంలో నారా లోకేష్ పర్యటనలో ఉండగానే తన రాజీనామాతో సన్యాసిపాత్రుడు షాక్ ఇచ్చాడు. తాజాగా....ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో...స‌న్యాసిపాత్రుడు పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. టీడీపీ ముఖ్య‌నేత అయిన అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి పెద్ద షాక్ అని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. త‌న‌పై అయ్య‌న్న విరుచుకుప‌డిన మ‌రుస‌టిరోజే...ఆయ‌న‌కు జ‌గ‌న్ ఊహించ‌ని షాక్ ఇచ్చార‌ని అంటున్నారు. ఇదిలాఉండ‌గా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వైసీపీ, బీజేపీలో చేరగా.. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: