హైదరాబాదీలకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎస్‌ఆర్డీపీలో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన  ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్  పుణ్యమా అని  బయోడైవర్సిటీ జంక్షన్ లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 


హైదరాబాద్ ఐటీ కారిడార్ ఏరియాలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఎస్.ఆర్.డి.పి ప్రాజెక్ట్ లో ఇప్పటికే మూడు అండర్ పాస్ లు నాలుగు ఫ్లైఓవర్లు అందుబాటులోకి  రాగా... మరొక ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. మెహిదీపట్నం నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే ఇంతకాలం బయోడైవర్సిటీ సిగ్నల్ వద్ద నరకం కనిపించేది.. రూ. 70కోట్ల వ్యయంతో 900 మీటర్ల మేర మూడు లైన్లుగా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు.   


ఇపుడు ఈ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావటంతో ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యలకు కొంత చెక్ పడింది. ఖాజాగూడ నుంచి బయోడైవర్సిటీ ద్వారా హైటెక్ సిటీ వరకు ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా దూసుకుపోవచ్చు. ఒకపక్క నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తూనే.. మరో ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్ .. మైండ్ స్పేస్ ఐకియా స్టోర్ వెనుక నుంచి గచ్చిబౌలీ ఫ్లై ఓవర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ కు కనెక్ట్  అయ్యేలా.. మరో ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేశారు. ఐటీ కారిడార్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు దాంతో పాటూ ఎయిర్ పోర్టు వెళ్లే వాళ్ళకు కొత్త ఫ్లై ఓవర్ ఉపయోగ పడనుంది. 


ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు, తక్కువ సమయంలోనే ప్రయాణీకులు గమ్యం చేరేలా  సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు తీసుకు వచ్చిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి చేయాలని జి.హెచ్.ఎమ్.సి సర్వశక్తులు ఒడ్డుతుంది. అన్నీ ఫ్లై ఓవర్స్, అండర్ పాసులు అందుబాటు లోకి వస్తే అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్ నిలవడం ఖాయం అంటుంది జి.హెచ్.ఎం.సి. 


మరింత సమాచారం తెలుసుకోండి: