ఢిల్లీలో సరిబేసి విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రమాదకరంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు  ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సగంపైగా వాహనాలు రోడ్డెక్కవని దీనివల్ల కాలుష్యం తగ్గే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.  


దేశ రాజధాని ఢిల్లీలో సరి బేసి విధానం అమల్లోకి వచ్చింది. కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా  నేటి నుంచి ఈ విధానాన్ని తీసుకొచ్చారు. నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు సరి - బేసి సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఉల్లంఘిస్తే రూ. 4 వేలు జరిమానా విధిస్తారు. ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన వర్తించదు. ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా 2015లో సరి - బేసి విధానాన్ని అమలు చేసింది.


అయితే సరి బేసి విధానం నుంచి అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి మినహాయింపు కల్పించినప్పటికీ.. ఢిల్లీ సీఎం, మంత్రులకు మాత్రం మినహాయింపు కల్పించలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్ సభ  స్పీకర్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ, లోక్ సభ పక్ష నేతల వాహనాలతో పాటు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాహనాలకు, సుప్రీం కోర్టు జడ్జిలకు, యూపీఎస్సీ చైర్ పర్సన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్లు, కాగ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ హైకోర్టు జడ్జిలు, లోకాయుక్త వాహనాలకు, ఎమర్జెన్సీ సర్వీసులకు ఈ విధానం నుంచి మినహాయింపు కల్పించినట్లు సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలకు కూడా ఈ విధానం నుంచి వెసులుబాటు కల్పించారు.


ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం భరించరాని స్థాయికి చేరింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం హానికర స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి శ్వాసకోశ సమస్యలకు, వ్యాధులకు దారితీస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం 30కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో వాహన కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం గతంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన సరి-బేసి విధానం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. సోమవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఒక రోజు సరి సంఖ్య రిజిస్ట్రేషన్ నంబరుగా ఉన్న వాహనాలను, రెండో రోజు బేసి సంఖ్య ఉన్నవి రోడ్లపైకి అనుమతిస్తారు. దీనివల్ల రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు రావొద్దని ఢిల్లీ ఆరోగ్య మంత్రి  ప్రజలకు పిలుపునిచ్చారు. కాలుష్య నివారణ మాస్క్ లు ధరించాలని, కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని.. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించారు. ప్రతి రోజు 30 లక్షల కార్లు ఢిల్లీ రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ రూల్ వల్ల రోజు 15 లక్షల కార్లు రోడ్డుపైకి రావనీ, దీని వల్ల ఖచ్చితంగా కాలుష్యం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: