ఏ ముహూర్తాన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమం పెట్టుకున్నారో  చివరకు అదికాస్త రాంగ్ మార్చ్ గానే అయిపోయింది. పవన్ మార్చ్ ఫెయిలవ్వటానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. మొదటిది ఇసుక లభ్యతతో సంబంధం లేని విశాఖపట్నంను ఎంచుకోవటం. రెండోది అత్యంత అవినీతిపరులుగా ముద్రపడిన తెలుగుదేశంపార్టీలోని మాజీ మంత్రులను పక్కన పెట్టుకోవటం. చివరిది ఓ వాహనంలోకి ఎక్కటం.

 

లాంగ్ మార్చ్ అనే కార్యక్రమాన్ని ప్రకటించినపుడు విశాఖ నగరంలో ఓ పది కిలోమీటర్లు నడుస్తానని చెప్పారు. భవన నిర్మాణ కూలీలందరు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అయితే మార్చ్ లో ఎక్కడ చూసినా టిడిపి నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులే కనిపించారు. మరి ఈ జనాల్లో భవన నిర్మాణ కార్మికులున్నది లేనిది కూడా ఎవరికీ తెలీలేదు. అసలు ఇసుక రీచ్ లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పెట్టుకోవాల్సిన మార్చ్ ను సంబంధం లేని విశాఖ నగరంలో పెట్టటమే వింత.

 

కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రకటించినపుడు 10 కిలోమీటర్లు నడుస్తానని చెప్పిన పవన్ చివరకు వాహనంలో ప్రయాణం చేయటమేంటి ? అదికూడా ఓ 2 కిలోమీటర్లు మాత్రం ప్రయాణించారు. అంటే పిలుపిచ్చిన పవన్ ఏమో వాహనంలో ప్రయాణిస్తే  పిలుపందుకుని వచ్చిన అభిమానులు మాత్రం కాలినడకన సభా వేదిక దగ్గరకు చేరుకోవటమే విచిత్రంగా ఉంది.

 

అదే సమయంలో అధికారంలో ఉన్నపుడు అడ్డదిడ్డంగా అవినీతికి పాల్పడిన మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడును చెరోపక్కన పవన్ పెట్టుకుని అవినీతికి వ్యతికిరేకంగా మాట్లాడటమే పెద్ద జోక్. నిజానికి ఇసుక కొరతకు నిరసనగా భారీ ర్యాలి, సభ అంటే కొరతను అధిగమించేందుకు పవన్ సూచనలు చేస్తారని అందరూ అనుకున్నారు.

 

అయితే తన ప్రసంగం మొత్తంలో జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి మాత్రమే పరిమితమవ్వటమే విచిత్రం. అందుకనే చంద్రబాబునాయుడు రాసిచ్చిన స్క్రిప్టునే పవన్ చదివేశాడంటూ మంత్రులు, వైసిపి నేతలు పవన్ ను వాయించేస్తున్నారు. మరి వాళ్ళడిగిన ప్రశ్నలకు పవన్ మళ్ళీ ఎప్పుడు స్పందిస్తారో ఏమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: